Tollywood Actor Rajanala Nageswara Rao Unknown Facts, Biography - Sakshi
Sakshi News home page

నాన్న స్టయిల్‌ని చాలామంది ఫాలో అయ్యేవారు

Published Sun, Jul 11 2021 9:40 AM | Last Updated on Sun, Jul 11 2021 10:16 AM

Tollywood Actor Rajanala Nageswara Rao Unknown Facts, Biography - Sakshi

ఆరడుగుల ఆజానుబాహుడు.. కన్ను తిప్పుకోలేని వస్త్రధారణ..
అందంగా కనిపించే విలక్షణ విలన్‌... సూటు వేసుకుంటే నిజాం నవాబు..
‘భలే మామా భలే...’ ‘ఇదే మన తక్షణ కర్తవ్యం...’ ‘బాబులు గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అనాలి..’
‘రారోయి మా ఇంటికీ! మావా! మాటున్నదీ! మంచి మాటున్నదీ!’
ఈ మాటలపాటల ప్రత్యేకతలతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు...
కొద్ది సినిమాలలో నటించి, అతి కొద్దికాలం మాత్రమే జీవించి, తెలుగు సినీ పరిశ్రమలో అందమైన విలన్‌గా ముద్ర వేసుకున్న ఆర్‌. నాగేశ్వరరావు గురించి జ్ఞాపకాలుగా ఆర్ద్రమైన గుండెతో పంచుకున్నారు  సింగపూర్‌లో నివాసం ఉంటున్న వారి పెద్ద కుమార్తె సుహాసిని..

‘నాన్న పోయేనాటికి నా వయసు ఎనిమిది సంవత్సరాలు. నాన్నకు మాసివ్‌ అటాక్‌ రావటం, మేడ మీద నుంచి ఆయనను కిందకు తీసుకు రావటం, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా దారిలోనే మరణించటం, ఇంటికి తీసుకువచ్చి హాలులో.. నిండైన విగ్రహంలాంటి నాన్నను పడుకోపెట్టడం.. పక్కనే అమ్మ కన్నీరుమున్నీరవ్వటం... నా మనసు ఆయన జ్ఞాపకాలలోకి పరుగులు తీస్తూనే ఉంటుంది. 

ఐస్‌క్రీమ్‌ చేసి పెట్టేవారు..
నాన్న సికింద్రాబాద్‌ జీరాలో పుట్టి పెరిగారు.  నాన్న నాయనమ్మ కడుపులో ఉండగా తాతగారు పోయారు. అప్పటికే నాన్నకు ఒక అన్నయ్య ఉన్నారు. నాన్న వాళ్ల అన్నయ్య ఇంట్లోనే పెరిగారు. అది నాన్న సొంత ఇల్లే. నాన్న మంచి పొజిషన్‌కి వచ్చాక ఆ ఇల్లు వాళ్లకి ఇచ్చేశారు. నాన్న నవాబులతో దోస్తీగా ఉండేవారు. ఆయన మాట్లాడే భాషలో తెలంగాణ నవాబుల హిందీ ఉర్దూ మాండలికం ఉండేది. అమ్మ రత్నాబాయి గుంటూరు లో పుట్టి పెరిగింది. నాన్నగారిది మేనరికం. మేం ఐదుగురు పిల్లలం. మోహన్, తాతాజీ, సుహాసిని (నేను), శ్యామ్, చాందినీ. అన్నయ్యలు, తమ్ముడు గతించారు. నేను, చెల్లి మాత్రమే ఉన్నాం. నాన్న పోయేనాటికి చెల్లెలికి నాలుగేళ్లు, నాకు ఎనిమిది సంవత్సరాలు. అందరం హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నాను.

దొంగరాముడు చిత్రంలో సావితి, ఆర్‌. నాగేశ్వరరావు

రిక్షాలో వెళ్లమన్నారు..
అమ్మ వాళ్లందరూ తరచుగా భద్రాచలం వెళ్లేవారు. రైల్వే స్టేషన్‌ మా ఇంటికి దగ్గరే. కాని అందరూ పని పూర్తి చేసుకుని వెళ్లేసరికి ట్రైన్‌ టైమ్‌ అయిపోయేది. అందుకని నాన్న పరుగెత్తుకుంటూ, ఇంజన్‌ డ్రైవర్‌ దగ్గరకు వెళ్లి, రైలు ఆపించేవారట. బ్రిటిష్‌ టైమ్‌లో తాతయ్య (అమ్మవాళ్ల నాన్న) ట్రైన్‌ ఇంజిన్‌ డ్రైవర్‌గా ఉండేవారు. బహుశః అందుకే ఆపేవారేమో. ‘జీవితంలో కష్టపడటం నేర్చుకోవాలి, స్కూల్‌కి రిక్షాలో వెళ్లండి’ అని చెప్పేవారు నాన్న. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా, ప్రతి ఆదివారం స్వయంగా ఐస్‌క్రీమ్‌ తయారుచేసి పెట్టేవారు. అవకాశం ఉన్నప్పుడు బీచ్‌కి తీసుకెళ్లి, మాతో దాగుడు మూతలు ఆడేవారు. 

డ్రై ఫ్రూట్స్‌ తెచ్చేవారు..
మేం పొద్దున్నే నిద్ర లేచి హాల్‌లో కూర్చుని చదువుకుంటుంటే చూడటం ఇష్టం నాన్నకు.  కారులో అన్నవరం తీసుకువెళ్లేవారు. నదీ తీర ప్రాంతంలో డ్రైవింగ్‌ చేయటం చాలా ఇష్టం. అక్కడ స్నేహితులందరితో కలిసి భోజనం చేసేవారు. ప్రతి వారం మద్రాస్‌ ప్యారిస్‌ కార్నర్‌ నుంచి స్వీట్స్, పూలు, కూరలు తెచ్చేవారు. ఆ రోజుల్లోనే అంటే 1955 ప్రాంతంలోనే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌  తెచ్చేవారు. అమ్మ వంటలు బాగా చేసేది. నాన్న మంచి ఆహారం మితంగా తినేవారు. ప్రతిరోజూ రాత్రి పరాఠాలు, నాన్‌వెజ్‌ తినేవారు.  హైదరాబాద్‌ స్టయిల్‌ ఆహారం ఇష్టపడేవారు. మీగడ పెరుగంటే చాలా ఇష్టం.  

ఎస్‌.వి. రంగరావుతో నాగేశ్వరరావు

నాగులు బావ అనేవారు..
అప్పుడు మేం ఉన్న మా ఇంటితో ఎప్పటికప్పుడు కొత్త అనుబంధం ఏర్పడుతూనే ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా, అక్కడ నాన్నతో కలిసి పెరిగిన వాళ్లు, ‘‘మీ నాన్నతో కలిసి పెరిగాం. మేమంతా చనువుగా ఆయనను ‘నాగులు బావ’ అని పిలిచేవాళ్లం’’ అని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్‌పి రోడ్‌లో ఇప్పటికీ పాత హార్డ్‌వేర్‌ దుకాణాలున్న ప్రాంతానికి వెళితే, ‘మిమ్మల్ని బాగా చూసినట్లు ఉంది. అచ్చం నాన్నగారిలా ఉన్నారు’ అంటూ, నాన్నను గుర్తు తెచ్చుకుంటారు. నాన్న నిండైన విగ్రహమే అందుకు కారణం. అమ్మ 90 సంవత్సరాలు వచ్చేవరకు జీవించింది. నాన్న గురించి అమ్మ చెప్పే మాటలు వింటూ పెరిగాను.


ఇప్పటికీ గుర్తుండిపోయింది...
నాన్న పోయిన రోజున ఆయనను తీసుకురావటం బాగా గుర్తుంది. గదిలో పడుకుని ఉండగా మాసివ్‌ అటాక్‌ వచ్చి అతి పిన్న వయసులోనే కన్నుమూశారు. ఆయనను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ చేదు జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది . నాన్న గురించి వింటూ, పెరగటం వల్ల, నాన్నలా ఉండాలనే భావన నాకు తెలియకుండానే అలవాటైపోయింది. ఆయన పర్సనాలిటీ నాకు వచ్చిందని గర్వపడతాను. నాన్న ఇప్పటికీ మా మనసులో, ఆలోచనలలో, చేతలలో సజీవంగానే ఉన్నారు. నాన్నకి అందమే కాదు, వ్యక్తిత్వం, అస్తిత్వం కూడా ఉన్నాయి. తల్లిదండ్రులతో ఉన్న బంధం మరచిపోవటం కష్టం. 

సుహాసిని 

నాన్న వెరీ పర్టిక్యులర్‌
నాన్న ఆజానుబాహువు. అందమైనవారు. నాన్న స్టయిల్‌ని చాలామంది ఫాలో అయ్యేవారు. నవాబుల కంటె హుందాగా, గొప్పగా ఉండేవారు. నాన్న దగ్గర 300 సూట్లున్నాయి. షూస్‌ లెక్క చెప్పలేను. ఏ సూట్‌లో చూసినా ఎంతో కంఫర్టబుల్‌గా అనిపించేవారు. ఎస్‌వి రంగారావు అంకుల్‌ గృహప్రవేశానికి నాన్న హై కాలర్‌ (నెహ్రూ కాలర్‌) బ్లాక్‌ సూట్, ఎస్‌విఆర్‌ వైట్‌ సూట్, టోపీ ధరించారు. అతిథులందరికీ నాన్న విస్తళ్లు వేసి వడ్డించారు. అడ్డగీతల రా సిల్క్, బ్రైట్‌ ఎల్లో... హై కాలర్‌ స్వెటర్‌తో ఇంగ్లీషు దొరలా ఎంతో దర్పంగా, హుందాగా అనిపించేవారు. మా అందరికీ నాన్నే బట్టలు కొనేవారు. ఒకసారి నాకు అద్దాలు కుట్టిన నల్ల లంగా తీసుకువచ్చారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. ఇప్పటికీ అలాంటి లంగా కనిపిస్తే, ఆ రోజులు గుర్తుకు వస్తాయి. – సుహాసిని 

సంభాషణ: వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement