ఒకప్పుడు సినిమా టైటిల్ చూడగానే దాని కథ ఏంటి? ఏ జానర్ ఫిల్మ్? అనేది ఈజీగా తెలిసిపోయేది. కానీ ఇప్పటి సినిమాలకు మాత్రం విచిత్రమైన టైటిల్స్ పెట్టేస్తున్నారు. కొన్ని టైటిల్స్‌కి కథతో సంబంధం ఉంటే.. మరికొన్నింటికి మాత్రం మీనింగే ఉండడం లేదు. కొత్తగా, ట్రెడింగ్‌లో ఉన్న పదం కనిపిస్తే చాలు అదే సినిమా టైటిల్ అవుతుంది. ఇక టాలీవుడ్‌లో అయితే ఇటీవల వారాల పేర్లనే సినిమా టైటిల్స్‌గా వాడేస్తున్నారు దర్శకులు. ఆదివారం నుంచి శనివారం వరకు వారాల పేర్లతో వచ్చిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.
‘శనివారం’వాడేసిన నాని
‘అంటే సుందరానికీ.. ’తర్వాత నాని, వివేక్ ఆత్రే కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది.డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. దసరా సందర్భంగా సోమవారం టైటిల్‌ని ప్రకటిస్తూ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో నాని మాస్ లుక్‌లో కనిపించాడు. ‘యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్’గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
‘మంగళవారం’కోసం పాయల్ ఎదురుచూపులు
‘మంగళవారం’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్ఎక్స్ 100'ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక ఊర్లో ప్రతి మంగళవారం జరిగే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తిర్చిదిద్దినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
రెండేళ్ల క్రితమే ‘గురువారం’ వాడేసిన శ్రీసింహా
రెండేళ్ల క్రితమే గురువారాన్ని తన టైటిల్‌గా వాడేశాడు కీరవాణి కొడుకు శ్రీసింహా. ఆయన హీరోగా మణికాంత్ గెల్ల దర్శకత్వంలో శ్రీసింహా హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. 2021లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. చిన్న చిన్న విషయాల్లో అనుమానించి విడిపోవడానికి సిద్దమయ్యే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే.. అతను పడే ఇబ్బందులు ఎలా ఉంటాయనే విషయాన్ని మంచి కామెడితో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మణికాంత్ జెల్లీ. కానీ ఆ కామెడినీ ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించలేకపోయారు.
ఆడవాళ్ల కోసం ఆదివారం
ఇక ఆదివారాన్ని సైతం తమ సినిమా టైటిల్‌గా వాడేసుకున్నారు మన తెలుగు దర్శకుడు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’అనే చిత్రం 2007లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, సుహాసిని, కోవై సరళ, బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, కొండవలస, తెలంగాణా శకుంతల, అభినయశ్రీ, గీతాసింగ్, సురేఖావాణి ముఖ్యపాత్రలు పోషించారు.
ఇవే కాదు.. సోమ, బుధ, శుక్రవారం పేర్లతో కూడా సినిమాలు వచ్చాయి. ఏ వెన్నెస్ డే(బుధవారం) పేరుతో నసీరుద్దీన్ షా ప్రేక్షకుల ముందుకు రాగా.. అది సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ‘ఈనాడు’తో కమల్ సినిమా వచ్చింది. శుక్రవారం, సోమవారం పేరుతో కూడా గతంలోనే సినిమాలు వచ్చాయి. మొత్తానికి మన దర్శక నిర్మాతలు అన్ని వారాలను వాడేశారు...ఇక మిగిలింది నెలల పేర్లే.. రానున్న రోజుల్లో జనవరి.. ఫిబ్రవరి.. అంటూ నెలల పేర్లు కూడా టైటిల్స్‌గా వస్తాయేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment