ఒకరి అనుభవాలు ఇంకొకరికి పాఠాలు కావు. ఎవరి జీవితం వారిదే! ఇదే చూపిస్తుంది త్రిభంగ. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం. ఒడిస్సీ నృత్యరీతిలోని అభంగ, త్రిభంగ, సమభంగల ఆధారంగా మూడు ప్రధాన భూమికలను చిత్రీకరించిందీ సినిమా. అభంగ... పాదాల దగ్గర్నుంచి నడుము వరకు ఒక వైపు వంగి ఉండే భంగిమ. ఈ సినిమాలో తొలి తరానికి ప్రతీక. త్రిభంగ.. కాళ్లు, నడుము, భుజాలు ప్లస్ తల.. మూడు మూడు రకాలుగా వంగి ఉండే పోజు. మధ్య తరానికి చిహ్నం ఈ చిత్రంలో. సమభంగ.. బ్యాలెన్స్‌డ్‌గా ఉండే భంగిమ.. మూడో తరాన్ని సూచిస్తుంది. ఒక కుటుంబంలోని నిర్ణయాలు పిల్లల మీద చూపే ప్రభావాలు, అవి ఆ కుటుంబంలోని తల్లులను ఇంపర్‌ఫెక్ట్ మదర్స్‌గా.. కూతుళ్లను డిఫికల్ట్ డాటర్స్‌గా ఎలా చిత్రించాయో.. ఆ సంబంధ బాంధవ్యాలను చర్చిస్తుందీ సినిమా.
కథ..
నయనతార (తన్వీ ఆజ్మీ) రచయిత్రి. మహిళా సమస్యల మీద రచనలతో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటూంది. ఇద్దరు పిల్లలు అనూరాధ, రబీంద్రో. ఆమె రచనా వ్యాసంగంలో మునిగి ఉంటుంది. అయితే అందరి కోడళ్లలాగే తన కోడలూ ఇంటి బాధ్యతల్లో మునిగి, పిల్లల పెంపకం మీద దృష్టి పెట్టి, తన సేవలో తరించాలని అనుకుంటుంది ఆ అత్తగారు. ఆ అసంతృప్తిని ఒకరోజు వెళ్లగక్కుతుంది కోడలి స్నేహితుల ముందు. ఏ రచనా ప్రతిభను చూసి తనను ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడో ఆ క్వాలిటీనే అత్తగారు తప్పుబడుతుంటే భర్త నోరుమెదపకుండా తననే సర్దుకుపొమ్మని చెప్పేప్పటికి తట్టుకోలేక పిల్లలను తీసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. అనూరాధ, రబీంద్రో టీన్స్‌లోకి వచ్చేనాటికి నయనతార ఒక ఫోటో జర్నలిస్ట్‌తో ప్రేమలో పడి.. అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అతను అనురాధ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటాడు. ఆ విషయం తల్లికి చెప్పలేక, దాచుకోలేక మానసిక వేదనకు గురవుతుంది. తన ఆ స్థితికి తల్లే కారణమన్న అభిప్రాయాన్ని స్థిరపరచుకుంటుంది అనూరాధ. తమ్ముడి బాధ్యతను తానే తీసుకుంటుంది తల్లిగా. అందుకే రబీంద్రో కూడా తల్లి పట్ల వ్యతిరేకతను పెంచుకుంటాడు.
‘త్రిభంగ’లో దృశ్యాలు
అనూరాధ (కాజోల్) ఒడిస్సీ డాన్సర్ అవుతుంది. సినిమానూ కెరీర్‌గా తీసుకుంటుంది. కాంట్రవర్షియల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటుంది. ఒక రష్యన్‌తో ప్రేమలో పడి సహజీవనం చేస్తుంది. కూతురిని కంటుంది. ఆ అమ్మాయే మషా (మిథిలా పాల్కర్). సహచరుడు విపరీతంగా హింసించడంతో తెగతెంపులు చేసుకొని సింగిల్ మదర్‌గా పిల్లను పెంచుతుంది. తన తల్లి వల్ల తనేం ఇబ్బందులను ఎదుర్కొందో .. ఎలాంటి అభద్రతకు లోనైందో అవేవీ తన కూతురి కలల్లోకి కూడా రాకుండా జాగ్రత్త పడ్తుంది అనురాధ. మషా.. ఒక గుజరాతీ ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయి ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ ఇంటి పరువు, మర్యాదలను కాపాడుతూ, ఆ ఇంటి సభ్యులు కోరుకుంటున్నట్టుగా మనవడినే ఇవ్వాలనే తాపత్రయంతో ఉంటుంది. కూతురి తీరు చూసి అవాక్కవుతుంది అనూరాధ.
‘‘అంత కాంప్రమైజ్ అయ్యి.. నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరమేంటి? నువ్వూ నాకు ఆడపిల్లవే కదా.. నిన్ను నేను పారేసుకోలేదు. నేనూ అమ్మమ్మకు ఆడపిల్లనే. నన్ను తను పుట్టకుండానే చంపుకోలేదు కదా?’’ అని ప్రశ్నిస్తుంది కూతురిని. ‘‘నిజమే.. అమ్మమ్మ ఇచ్చిన అభద్రత నీకో పాఠం నేర్పింది. ఆ ఒక్కదానిపట్లే నువ్వు జాగ్రత్తపడ్డావు. నీ బాయ్ ఫ్రెండ్స్ నెవరినీ మనింటికి రానివ్వకుండా కాపాడుకున్నావు. కనీసం మీ నాన్నను నువ్వు చూశావు.. నాకు మా నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. అందుకే నాకు భద్రమైన కుటుంబ జీవితం కావాలనుకున్నాను. దొరికింది. పణంగా ఏం పెట్టాల్సి వచ్చినా పెడ్తాను’ అంటుంది మషా. ఖిన్నురాలవుతుంది అనూరాధ. తన తల్లిలా తాను ఉండకూడదనుకుంది.. కాని తన కూతురికి ఏం కావాలనుకుంటుందో ఏనాడూ ఆలోచించలేదు అనే అంతర్మథనానికి గురవుతుంది.
నయనతార బ్రెయిన్ హేమరేజ్‌తో ఆసుపత్రిలో చేరుతుంది కోమా స్టేజ్‌లో. అప్పుడు తల్లిని చూడ్డానికి వస్తుంది అనూరాధ. ఆ ఆసుపత్రి బ్యాక్‌డ్రాప్‌లో బ్యాక్‌ఫోర్త్‌గా కథనం సాగుతుంది. కూతురి మనసులో మాట విని, తల్లి తనకు, తన తమ్ముడికి రాసిన ఉత్తరం చదివి ఆమెనెంత అపార్థం చేసుకుందో గ్రహిస్తుంది అనూరాధ. కానీ అప్పుడేం లాభం ఇక!
Comments
Please login to add a commentAdd a comment