బుల్లితెర నటి దల్జీత్ కౌర్ రెండో పెళ్లికి రెడీ అయింది. యూకేకు చెందిన నిఖిల్ పటేల్‌తో ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'గతేడాది దుబాయ్‌లో ఫ్రెండ్స్ పార్టీలో నిఖిల్‌ను కలిశాను. అప్పుడు నేను నా కొడుకు గురించి మాట్లాడుతుంటే అతడు తన కూతుర్లు అరియానా, అనికల గురించి చెప్పుకురాసాగాడు. పిల్లల మీద మాకున్న ప్రేమే మా ఇద్దరినీ కలిపింది. అనిక అమెరికాలో తన తల్లితో కలిసి ఉండగా అరియానా మాతో కలిసి ఉండబోతోంది. మార్చిలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. నిఖిల్ ప్రస్తుతం ఆఫ్రికాలోని నైరోబీలో పని చేస్తున్నాడు కాబట్టి కొన్ని సంవత్సరాలపాటు అక్కడే ఉంటాం. అనంతరం అతడు పుట్టి పెరిగిన లండన్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకుంటాం' అని చెప్పుకొచ్చింది దల్జీత్.
కాగా ఏడాది పాటు ప్రేమించుకున్నాక ఇటీవలే జనవరి 3న నేపాల్‌లో నిశ్చితార్థం జరుపుకున్నారీ లవ్ బర్డ్స్. ఇకపోతే దల్జీత్ కౌర్ చూపులు కలిసిన శుభవేళ(ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) సీరియల్‌లో హీరో అక్క క్యారెక్టర్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే కాకుండా కాలా టీకా, కుల వద్దు వంటి సీరియల్స్‌లో ముఖ్య పాత్ర పోషించింది. 2009లో నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ షాలిన్ బానోత్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ జైడన్ అనే కుమారుడు ఉన్నాడు. మనస్పర్థల కారణంగా 2013లో వీరు విడాకులు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ తండ్రీకొడుకులు మాత్రం తరచూ కలుసుకుంటారు. మరి దల్జీత్ పెళ్లి చేసుకుని కొడుకుతో సహా విదేశాలకు వెళ్లిపోతే షాలిన్ తన కొడుకును తరచూ కలుసుకోవడం కష్టమే అంటున్నారు అభిమానులు.
Comments
Please login to add a commentAdd a comment