Umapathi Movie Review: అవికా గోర్ నటించిన 'ఉమాపతి' సినిమా రివ్యూ | Umapathi Telugu Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Umapathi Movie Review: అవికా గోర్ నటించిన 'ఉమాపతి' సినిమా రివ్యూ

Published Fri, Dec 29 2023 6:26 PM | Last Updated on Fri, Dec 29 2023 6:38 PM

Umapathi Telugu Movie Review And Rating - Sakshi

విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రేమ కథలకు ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ అందిస్తుంటారు. అలాంటి ఓ ప్రేమ కథా చిత్రమే 'ఉమాపతి'. ఇందులో అనురాగ్ హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్‌గా నటించింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మించగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథేంటి?
ఉమాపతి కథ దోసకాయలపల్లి, కొత్తపల్లి మధ్య జరుగుతుంది. వర (అనురాగ్) కొత్తపల్లికి చెందిన వాడు. ఊర్లో అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. దుబాయ్‌లో తండ్రి కష్టపడి సంపాదిస్తుంటే.. ఇక్కడ ఆ వర జల్సాలు చేస్తూ ఉంటాడు. అలాంటి వర.. పక్క ఊరైన దోసకాయపల్లిలో ఉమా (అవికా గోర్)ను ఇష్టపడుతుంటాడు. కానీ ఆ ఊరికి ఈ ఊరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంటుంది. పైగా ఉమా సోదరుడికి, వరకు పాత గొడవలు కూడా ఉంటాయి. ఇలాంటి ఈ తరుణంలో వర తన ప్రేమను ఆ అమ్మాయికి ఎలా చెబుతాడు? అసలు వీరిద్దరూ ప్రేమలో పడతారా? పడితే ఆ ప్రేమను ఎలా గెలిపించుకుంటారు? ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న గొడవలు ఏంటి? చివరకు వారి ప్రేమ కథకు ఎండింగ్? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

ఎలా ఉంది? 
ఉమాపతి సినిమా అంతా కూడా అనురాగ్, అవికా గోర్ మధ్యే సాగుతుంది. అనురాగ్‌ తెరపై తన ప్రతిభను చాటుకున్నాడు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చక్కగా పలికించాడు. అవికా గోర్ అందంగా కనిపిస్తూనే.. తన అల్లరితో, తన నటనతో అందరినీ కట్టి పడేసింది. వీరిద్దరి జోడికి ప్రేక్షకులు కచ్చితంగా ఆకర్షితులవుతారు. ఇక మిగిలిన పాత్రల్లో హీరో ఫాదర్, హీరోయిన్ బ్రదర్, హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ
దర్శకుడు సింపుల్ కథను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచాడు. ఇలాంటి స్టోరీలు ఇది వరకు ఎన్నో సార్లు మనం చూసినా కూడా ఉమాపతి కాస్త రీ ఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల గిల్లికజ్జాలు, ఇద్దరి మధ్య దూరం తగ్గి ప్రేమ చిగురించే సన్నివేశాలు.. ఊరి వాతావరణం, గొడవలు, జోకులు ఇలా అన్నింటిని మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్‌ను చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇంట్రవెల్‌కు చిన్న పాటి జర్క్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లోనే అసలు పాయింట్‌ బయటకు వస్తుంది.

రెండు ఊర్ల మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆ గొడవకు ఈ ప్రేమ కథకు ఎలా ముడి పెట్టారు.. ఆ సంఘర్షణను దర్శకుడు చక్కగా చూపించాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. చివరకు తెలుగు సినిమాల్లో ఉండే రెగ్యులర్ ముగింపులానే సినిమా కూడా ఎండ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగితే.. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది.

సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాకు పాటలు, ఆర్ఆర్ ప్లస్ అవుతాయి. ఆహ్లాదకరమైన సంగీతం ఉంటుంది. సహజంగా కనిపించే విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కొన్ని డైలాగ్స్ గుండెల్ని హత్తుకుంటాయి. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement