జనాలు కరోనా భయాన్ని వీడడంతో థియేటర్లకు మళ్లీ మునుపటి రోజులు వచ్చాయి. దసరా, దీపావళి పండగలకు వరుస సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేశాయి. గతవారం సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’తో పాటు పూరి ఆశాశ్ ‘రొమాంటిక్’, సంతోష్ శోభన్ ‘మంచి రోజులు వచ్చాయి’లాంటి చిత్రాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించాయి. ఇక సూర్య నటించిన ‘జైభీమ్’ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఇలా గతవారం స్టార్ హీరోల సినిమాలు విడుదలవ్వడంతో సినీ ప్రియులు దీపావళి పండగను మరింత ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ వారం కూడా పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యాయి. అవేంటో చూద్దాం.
రాజా విక్రమార్క
యంగ్ హీరో కార్తీకేయన్ తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీతోనే తమిళ నటి తన్యా రవిచంద్రన్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇందులో కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్ విక్రమ్‌గా కనిపించారు. తనికెళ్ల భరణి, సాయి కుమార్‌లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
పుష్పక విమానం
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'పుష్పక విమానం'. ఈ చిత్రం నవంబర్12న థియేటర్స్‌లో విడుదల అవుతోంది. దామోదర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శాన్వి మేఘన హీరోయిన్ .పెళ్లయిన తర్వాత భార్య వేరే వాళ్లతో వెళ్లిపోతే, సుందర్(ఆనంద్ దేవరకొండ) అనే స్కూల్ టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన భార్య ఇంట్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? అనేదే పుష్పక విమానం కథ. ఈ చిత్రానికి రామ్ మరియాల సంగీతం అందించాడు.
తెలంగాణ దేవుడు
శ్రీకాంత్ హీరోగా నటించిన కెసిఆర్ బయోపిక్ ‘తెలంగాణ దేవుడు’ సినిమా కూడా 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. జిషాన్ ఉస్మాన్ హీరోగా సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్ , తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి, ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్రతో ఈ సినిమా రూపొందించారు. ఉద్యమం చేసి, సాధించుకున్న తర్వాత తెలంగాణలో ఏర్పడిన పరిణామాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చిత్రం బృందం పేర్కొంది. వీటితో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించిన ‘కె3 కోటికొక్కడు’ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా 12వ తేదీన రిలీజ్ అవ్వనుంది. ‘ది ట్రిప్’ అనే చిన్న సినిమా కూడా 12వ తేదినే థియేటర్లలో రానుంది.
ఆహాలో ‘3 రోజెస్’
తెలుగు ఓటిటి ఆహాలో పూర్ణ, ఈషా రెబ్బ, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ‘3 రోజెస్’ సీరిస్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సిరీస్‌కి మగ్గీ దర్శకత్వం వహిస్తున్నాడు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు.. ఒకేచోట కలిసి స్నేహితులయ్యాక.. వాళ్ల కథలు ఎటు మలుపు తిప్పాయి. అస్సలు సమాజంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనే ఆసక్తికర అంశంతో ఈ సిరీస్ తెరకెక్కినట్లు తెలుస్తోంది.
ఓటీటీలో వచ్చే చిత్రాలివే...
డిస్నీ+ హాట్‌స్టార్
- డోప్ సిక్(నవంబర్ 12)
- కనకం కామిని కలహం(నవంబరు12)
- జంగిల్ క్రూయిజ్(నవంబరు12)
- స్పెషల్ ఆప్స్(నవంబరు12)
- షాంగ్-చి(నవంబరు12)
జీ5
- అరణ్మణై 3(నవంబరు12)
- స్క్వాడ్ (నవంబరు12)
నెట్‌ఫ్లిక్స్
- రెడ్‌నోటీస్ (నవంబరు 12)
Comments
Please login to add a commentAdd a comment