‘ఊరికి ఉత్తరాన’ మూవీ రివ్యూ | Uriki Uttarana Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Uriki Uttarana Review: ‘ఊరికి ఉత్తరాన’ మూవీ ఎలా ఉందంటే..?

Published Sun, Nov 21 2021 11:09 AM | Last Updated on Sun, Nov 21 2021 11:20 AM

Uriki Uttarana Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : ఊరికి ఉత్తరాన
నటీనటులు : నరేన్ వనపర్తి, దీపాళ్లీ శర్మ, ఆనంద చక్రపాణి, రామరాజు, అంకిత్ కొయ్య, జగదీష్, ఫణి తదితరులు
నిర్మాణ సంస్థ : ఈగల్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : వెంకటయ్య వనపర్తి, రాచల యుగేందర్ గౌడ్
దర్శకత్వం : సతీష్ పరమవేద 
సంగీతం : భీమ్స్ సెసిరోలియో
సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ అరుపుల 

కథలో బలం ఉంటే చాలు.. హీరో ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే  విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘ఊరికి ఉత్తరాన’. టైటిలే డిఫరెంట్‌గా ఉండడం, ఇటీవల విడుదలైన ట్రైలర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో ‘ఊరికి ఉత్తరాన’పై అంచనాలు పెరిగాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్‌ 19)థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే
వరంగల్‌ జిల్లా పర్వతగిరి పెద్ద పర్వతనేని శంకర్ పటేల్ (రామరాజు)‌ సోదరి ప్రేమ వివాహం చేసుకుంటుంది. తనకి ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో..  ఆ యువకుడిని కాకతీయ తోరణానికి కట్టి ఉట్టి కొట్టిస్తాడు. ఇక ముందు ప్రేమ వివాహాలు చేసుకొనే ప్రతీ ఒక్కరికి ఇలాంటి శిక్షే ఉంటుందని గ్రామ ప్రజలను హెచ్చరిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన మేనకోడలు శైలు ( దీపాళీ శర్మ) పక్క ఊరికి చెందిన రాజు అలియాస్‌ కరెంట్ రాజు(నరేన్ వనపర్తి)ని ప్రేమిస్తుంది. ఓ కారణంగా వీరిద్దరు ఊరు విడిచి హైదరాబాద్‌కు పారిపోతారు. కానీ తెల్లారేసరికి శైలు  పక్కన కనిపించదు. అసలు శైలు ఎక్కడికి వెళ్లింది? ఆమెను ఎవరైనా కిడ్నాప్‌ చేశారా లేదా మోసం చేసి పారిపోయిందా? 30 ఏళ్ల వయసులో కరెంట్ రాజు కాలేజీలో స్టూడెంట్‌గా ఎందుకు చేరాడు? శంకర్ పటేల్ గురించి తెలిసినా వారిద్దరు ప్రేమలో ఎలా మునిగిపోయారు? కరెంట్ రాజు, శైలు ప్రేమను శంకర్ పటేల్ అంగీకరించాడా? లేదా?అనేదే మిగతా కథ.

ఎవరెలా చేశారంటే..
హీరో, హీరోయిన్లు కొత్త వాళ్లు అయినా బాగా నటించారు. అవారాగా తిరిగే కరెంట్ రాజు పాత్రలో నరేన్‌ ఒదిగిపోయాడు. బాధ్యత తెలియని యువకుడిగా, ప్రేమికుడిగా, కాలేజీ స్టూడెంట్‌గా పలు వేరియన్స్‌ ఉన్న పాత్రని అవలీలగా పోషించాడు. శైలుగా దీపాళీ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. హీరో తండ్రి కరెంట్ నారాయణగా ఆనంద చక్రపాణి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న పర్వతనేని శంకర్ పటేల్ పాత్రలో రామరాజు సరికొత్తగా కనిపించారు. సినిమాలో మరో బలమైన పాత్ర తనది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
ప్రేమకు మరణం లేదు కానీ ప్రేమిస్తే మరణమే.. అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా ఇది. యూత్‌కి కనెక్ట్‌ అయ్యే కథను ఎంచుకొని.. అనుకున్నది అనుకున్నట్లు తెరపై చూపించడంతో సఫలం అయ్యాడు దర్శకుడు సతీష్ పరమవేద.  అతనికిది తొలి సినిమా అయినా ఎక్కడా కన్ఫ్యూజన్ కాకుండా, అనుభవజ్ఞుడు లా సుత్తి లేకుండా చెప్పాల్సిన పాయింట్ చెప్పాడు.  రామరాజు, ఆనంద చక్రపాణి పాత్రలను ఎమోషనల్‌గా తీర్చిదిద్ది సినిమా స్తాయిని పెంచాడు. భారీ బడ్జెట్ చిత్రాలనే కాకుండా స్టార్ హీరోలను కూడా లీడ్ చేసే సత్తాను తన తొలి చిత్రంతోనే నిరూపించుకొన్నారు. అయితే సినిమాలో కొన్ని సాగదీత సీన్స్‌ మాత్రం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తాయి. 

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. భీమ్స్ సెసిరోలియో బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టేశాడు. శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫి బాగుంది. కాకతీయ తోరణం సెట్టింగును తెరపైన అద్బుతంగా చూపించాడు. ఎడిటర్‌ శివ శ్రావణి తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని అనవసరపు సీన్స్‌ని కట్‌ చేస్తే సినిమా మరింత క్రిస్పీగా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement