Vadrevu Vishwanatham Acts With Senior Actor NTR And ANR - Sakshi
Sakshi News home page

ఎంతోమంది ఆప్తుల్ని ఇచ్చారు...

Published Sun, May 30 2021 9:15 AM | Last Updated on Wed, Jun 2 2021 5:53 PM

Vadrevu Vishwanatham Acts With Senior Actors NTR And ANR - Sakshi

వాడ్రేవు విశ్వనాథమ్‌, ఇన్‌సెట్‌లో కుమార్తె శ్రీకాంతి

మా నాన్నగారండీ.. ఆయనకి ఇద్దరు భార్యలండీ.. నేను మొదటి భార్య కొడుకునండీ ... అంటూ శంకరాభరణంలో అల్లురామలింగయ్య దగ్గరకు న్యాయం కోసం వచ్చారు.. శ్రీవారికి ప్రేమలేఖలో మరచెంబు పాత్రలో చతుర్ముఖ పారాయణం ఆడారు... చిన్న చిన్న పాత్రలే వేసినా, తెలుగువారి హృదయాల మీద హాస్య పన్నీరు జల్లారు. నాన్నకి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ అంటున్నారు వాడ్రేవు విశ్వనాథమ్‌ ఉరఫ్‌ థమ్‌ కుమార్తె శ్రీకాంతి. 

నాన్న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పుట్టారు. తాతగారు వాడ్రేవు చలమయ్య, బామ్మ లక్ష్మీకాంతమ్మ. వారికి నాన్న ఎనిమిదో సంతానం. ఇద్దరు అక్కలు, ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్లు. ‘తాతగారి పేరు, మార్కెట్‌కి ఎదురుగా ఉన్న వాడ్రేవు బిల్డింగ్, పిఠాపురం’ అని అడ్రస్‌ రాస్తే చాలు పోస్టు వెళ్లిపోతుంది. తాతగారు డ్రాయింగ్‌ మాస్టారుగా పనిచేసేవారు. మా పెద్దనాన్నగారే ఇంటి పెద్దగా అందరి బాగోగులు చూసుకున్నారు. నాన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా ఇన్‌ యాక్టింగ్‌ చేశారు.

ఆదిరాజు ఆనంద్‌మోహన్‌ మా అమ్మకి బాబాయ్‌. ఆయన ‘పెళ్లి కాని పెళ్లి’ అనే సినిమా తీశారు. అందులో నాన్న చిన్న వేషం వేశారు. అలా మా బాబాయ్‌ ద్వారా అమ్మకి నాన్నతో పెళ్లి సంబంధం కుదిరి, వివాహం జరిగింది. నాన్నగారికి ఆడవాళ్లంటే చాలా గౌరవం. అమ్మని ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. నేను పుట్టినప్పుడు ‘మా అమ్మే మళ్లీ పుట్టింది’ అని ఎంతో సంతోషంగా అందరికీ స్వీట్స్‌ పంచారుట. మా అన్నయ్య కొంచెం అమాయకంగా ఉంటాడని వాడిని ఎప్పుడూ కోప్పడేవారు కాదు. 

నాటకాలలో పరిచయం...
నాన్నకి నాటకాలంటే ప్రాణం. నాటకాల ద్వారానే సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్‌ గార్లతో పరిచయం ఏర్పడింది. సాక్షి రంగారావు గారిని నాన్న ‘మా రంగడు’ అనేవారు. పొట్టిప్రసాద్‌ గారు తనకు గురువుతో సమానమని చెప్పేవారు. సాక్షి రంగారావు గారిని పెద్దనాన్న అని, పొట్టి ప్రసాద్‌ గారిని మావయ్య అని పిలిచేవాళ్లం. రాళ్లపల్లి గారు మాకు దేవుడు ఇచ్చిన మావయ్యే. అన్న, అక్క అంటే మాకు వాళ్ల పిల్లలే. రాళ్లపల్లి మావయ్య వాళ్ల అమ్మాయి బయటికి వెళితే నన్ను తనతో తీసుకుని వెళ్లేది. సీతారామశాస్త్రి గారు, దివాకర్‌బాబు గారు.. అందరం చెన్నైలోని సాలిగ్రామంలోనే దగ్గరదగ్గరగా ఉండేవాళ్లం. ఇప్పటికీ అందరితో టచ్‌లో ఉన్నాం. మా నాన్న మాకు ఇచ్చి వెళ్లిన బెస్ట్‌ గిఫ్ట్‌ ఈ కుటుంబాలే.

చదివితే చాకొలేట్లు...
నాన్న షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా మా చదువు విషయంలో ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు. సెలవుల్లో కూడా చదువుకోవాలనేవారు. ఆయన సూట్‌కేస్‌లో థ్రెప్టిన్‌ బిస్కెట్ల డబ్బా, క్యాడ్‌బరీ చాకొలేట్‌ బాక్స్‌ ఉండేవి. రోజూ నాన్న బయటకు నుంచి ఇంటికి రాగానే మేం ఆయన వెనకాల నిలబడేవాళ్లం. మేము చదువుకున్నామని చెప్పాక ఇద్దరికీ రెండు బిస్కెట్లు, రెండు చాకొలేట్లు ఇచ్చేవారు. చదవకపోతే నో ట్రీట్‌. రెండో క్లాసు చదువుతున్నప్పుడు... ఒకరోజున ఇంటి దగ్గర టీవీ సీరియల్‌ షూటింగ్‌ జరుగుతోంది. అందులో చిన్న సీన్‌లో నేను, అన్నయ్య ఇద్దరం నటించాం. టీవీలో టెలికాస్ట్‌ అయినప్పుడు అన్నయ్య సీన్‌ వచ్చింది, నా సీన్‌ ఎడిట్‌ అయిపోయింది. నేను ఏడ్చాను. అప్పుడు నాన్న, ‘ఆడపిల్ల ఏడవకూడదు. నేను రాకపోతేనేం... అన్నయ్య టీవీలో కనిపించాడు కదా... అని నువ్వు సంతోషంగా ఉండాలి తల్లీ’ అని బుజ్జగించారు. 
 
చాలా సైలెంట్‌గా ఉండేవారు...
సినిమాలలో హాస్య పాత్రలు వేసేవారు కానీ, ఇంటి దగ్గర చాలా సైలెంట్‌. ఎక్కువ మాట్లాడేవారు కాదు. నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండేవాళ్లం. ఆయన బయటకు వెళ్లగానే కిటికీలోంచి తొంగి చూసేవాళ్లం. నాన్న గేట్‌ దాటాక, మేం గేటు దాకా వచ్చి, బస్‌స్టాప్‌లో ఉన్నారా, వెళ్లిపోయారా అని చూసి, ఆయన వెళ్లిపోయారని నిర్ధారించుకుని వెంటనే ఆడుకోవటానికి పారిపోయేవాళ్లం. ఒకసారి టీనగర్‌లో మా తాతగారి ఇంటికి వెళ్లాం. అక్కడ ఉండిపోతానని పేచీ పెట్టటంతో నన్ను అక్కడ ఉంచి వెళ్లిపోయారు నాన్న. అమ్మ సాయంత్రం వరకు ఉండి, ఆ తరవాత ఇంటికి వెళ్లిపోయింది. అమ్మ వెళ్లిన కాసేపటికే బెంగ వచ్చి ఏడుపు మొదలుపెట్టాను. అప్పటికి నాన్న ఏదో పని మీద ఇంకా టీ నగర్‌లోనే ఉన్నారు. తాతగారు నాన్నకి ఫోన్‌ చేసి, విషయం చెప్పటంతో, నాన్న వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. నాన్న దగ్గర అంత చేరిక నాకు. నేను పదో తరగతి ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయినప్పుడు వాచ్‌ ఇచ్చారు. నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమో ఇన్‌ యాక్టింగ్‌ చేశారని నేను కూడా నా ఎంబిఏ అక్కడ నుంచే చేశాను. 

ఏయన్నార్‌కి కోపం వచ్చింది...
మా చిన్నప్పటి కంటె, మేం కొంచెం పెద్దవాళ్లం అయ్యాకే నాన్నతో గడిపే అవకాశం వచ్చింది. అప్పటికి సినిమా షూటింగ్స్‌ తగ్గి, సీరియల్స్‌లో మాత్రం వేస్తుండేవారు. ఎక్కువసేపు ఇంట్లో ఉండటం వల్ల, మాతో క్యారమ్‌బోర్డు అడేవారు. అప్పుడప్పుడు ఏవైనా సినిమా కబుర్లు చెప్పేవారు. నాన్నకి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారితో... రాళ్లపల్లి ఏ క్లాస్‌ ఆర్టిస్ట్, నేను బి క్లాస్‌ ఆర్టిస్ట్, మీరు సి క్లాస్‌ ఆర్టిస్ట్‌ అన్నారట. అక్కినేని గారికి కొంచెం కోపం వచ్చిందట. అప్పుడు నాన్న.. అపార్థం చేసుకోకండి. రాళ్లపల్లిగారు ఆటోలో తిరుగుతున్నారు కాబట్టి ఆయన ఏ గ్రేడ్‌ ఆర్టిస్ట్, నేను బస్సుల్లో తిరుగుతున్నాను కాబట్టి బి గ్రేడ్‌ ఆర్టిస్ట్, మీరు కారులో తిరుగుతున్నారు కాబట్టి సి గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ అన్నారట. ఏయన్నార్‌గారు ఫక్కుమని నవ్వారుట. 

ఎన్టీఆర్‌ సహాయం చేశారు...
ఎన్టీఆర్‌లో ఉన్న ఒక గొప్ప గుణం గురించి చెప్పారు నాన్న. ఆయనకి చిన్న చిన్న కళాకారులు కూడా గుర్తు ఉంటారట. ఏదైనా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటే, దానికి ఏ ఆర్టిస్టు కరెక్ట్‌ అని ఆలోచించి, ఆ ఆర్టిస్టు ఎక్కడున్నా కబురు పంపేవారట. వారు కష్టాల్లో ఉంటే కూడా ఎన్టీఆర్‌ గుర్తుపెట్టుకుంటారనటానికి పొట్టి ప్రసాద్‌గారికి చేసిన సహాయమే పెద్ద నిదర్శనం. పొట్టిప్రసాద్‌ మావయ్యకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, హీరో బాలకృష్ణ గారితో ఒక బుట్ట నిండా పళ్లు పంపారు రామారావు గారు. బాలకృష్ణ గారిని దగ్గరుండి ఆసుపత్రికికి నేనే తీసుకువెళ్లాను. అప్పుడు నాలుగో క్లాసు చదువుతున్నాను. బాలకృష్ణ గారు ఎంతో ఆప్యాయంగా పలకరించి వెళ్లారు. ఎన్టీఆర్‌ గురించి నాన్న చెప్పిన మాటలు అప్పుడు నాకు బాగా గుర్తు వచ్చాయి.

ఇద్దరికీ ఒకటే పేరు పెట్టారు
నాన్న పూర్తి పేరు వాడ్రేవు కాశీవిశ్వనాథం. తన పేరులోని ఆఖరి అక్షరాలు తీసుకుని థమ్‌ అని పేరు పెట్టుకున్నారు. పేరు కూడా కామెడీగా ఉండాలని ఆయన ఆలోచన. తమిళంలో అలనాటి హాస్య నటుడు నగేశ్‌ అంటే ఇష్టం. అందుకే ఆయనలాగే సన్నగా ఉండేవారేమో అనుకుంటాం. అమ్మ పేరు లలిత. బి.ఎస్‌.సి. బిఈడీ చదివి, సైన్స్‌ టీచర్‌గా పనిచేసి, పెళ్లయ్యాక మానేసింది. ఇంటి బాధ్యతలు పూర్తిగా అమ్మే చూసుకుంది. వాళ్లకి మేం ఇద్దరం పిల్లలం. అమ్మమ్మ పేరు, బామ్మ పేరు ఇద్దరి పేరు ఒకటే.. లక్ష్మీ కాంతమ్మ. అందుకని నాకు శ్రీకాంతి అని, అన్నయ్యకు శ్రీకాంత్‌ అని పేర్లు పెట్టారు. ఇద్దరికీ ఒక్క చిన్న అక్షరం తేడా అంతే. 

కళ్లనీళ్లు పెట్టుకున్నారు..
నాన్నగారు ఏడవటం నా జీవితంలో నేను చూడటం అదే మొదటిసారి. పొట్టిప్రసాద్‌ మావయ్య ఆరోగ్యం బాగా దెబ్బ తినటంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను చూసి వచ్చిన నాన్నకు ఏడుపు ఆగలేదు. ఆ రోజు నాన్న మంచినీళ్లు కూడా తాగకుండా కూర్చుండిపోయారు. నేనే నాన్నని బుజ్జగించి, అన్నం తినిపించాను. ఆ మావయ్య కన్ను మూసిన రోజున నాన్నను ఓదార్చటం కష్టమైపోయింది. ఆయన మరణం తరవాత చాలా మార్పులు జరిగాయి. ఆప్తులందరూ హైదరాబాద్‌ తరలి వచ్చేశారు. నాన్న హైదరాబాద్‌ మారాలా వద్దా అని తర్జనభర్జన పడి, చివరకు మారటానికే నిశ్చయించుకుని, ఏవో వ్యక్తిగత పనుల మీద పిఠాపురం వెళ్లారు. అక్కడ ఉండగానే నాన్నకు అకస్మాత్తుగా హార్ట్‌ అటాక్‌ వచ్చి కాలం చేశారు. మాకు దిక్కుతోచని పరిస్థితి. అప్పటికింకా నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను.

మమ్మల్ని చెన్నై నుంచి సాక్షి శివ (సాక్షి రంగారావు కుమారుడు) అన్నయ్యే పిఠాపురం తీసుకువెళ్లాడు. ఆ తరవాత మేం హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అయ్యాం. సాక్షి రంగారావు పెద్దనాన్న సినీ ప్రముఖుల నుంచి కొంత డబ్బు సేకరించి అమ్మకు ఇచ్చారు. కె.విశ్వనాథ్‌ గారు పది వేలు ఇచ్చారు. సీతారామశాస్త్రి అంకుల్‌ ‘అమ్మాయిని నాకు ఇచ్చేయండి, పెంచుకుంటాను’ అన్నారు. ఆ రోజు నేను వెక్కివెక్కి ఏడుస్తుంటే, సీతారామశాస్త్రి అంకుల్‌ నన్ను ఓదారుస్తూ, ‘అమ్మాయీ! నాకూ మా నాన్నగారు లేరు, నేను ఆయనను ఎన్నటికీ చూడలేను. కాని నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ నాన్నను టీవీలో ఏదో ఒక సినిమాలో చూడగలవు కదా’ అన్నారు. ఆస్తులు పాస్తుల కన్నా అనుబంధాలు గొప్పవని నాకు అర్థమైంది. నాన్న చాలా మంది ఆప్తుల్ని మాకు ఇచ్చినందుకు మనసులోనే ఆయనకు నమస్కరిస్తాను.
సంభాషణ: వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement