Veteran Actress Savita Bajaj Says No One In Family Wants To Keep Me - Sakshi
Sakshi News home page

Savita Bajaj: అద్దింట్లో సీనియర్‌ నటి, సాయం కోసం దీనంగా వేడుకోలు

Published Fri, Jul 16 2021 3:46 PM | Last Updated on Sat, Jul 17 2021 12:57 PM

Veteran Actress Savita Bajaj Says No One In Family Wants To Keep Me - Sakshi

షగుఫ్త అలీ (పాత ఫొటో).. సవితా బజాజ్

నాకు ముంబైలో సొంతిల్లు కూడా లేదు. ఒక కిచెన్‌ రూమ్‌లో అద్దెకుంటున్నాను. నా కుటుంబంలోని ఏ ఒక్కరూ నన్ను వారితో ఉండనిచ్చేందుకు ఇష్టపడటం లేదు...

Veteran Actor Savita Bajaj Needs Financial Help: సీనియర్‌ నటి సవితా బజాజ్‌ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. 'నిశాంత్‌', 'నజ్రానా', 'బెటా హోతో ఐసా' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆదుకునేందుకు అయినవాళ్లు కూడా ముందుకు రాకపోవడంతో మూగగా రోదిస్తోందీ నటి. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. "నేను సంపాదించి కూడబెట్టినదంతా ఊడ్చుకుపోయింది. ఆ డబ్బంతా నా వైద్యం కోసమే ఖర్చు పెట్టాను. ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు చాలవన్నట్లు శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పుడేం చేయాలో కూడా పాలు పోవడం లేదు.

అసలే నాకు ముంబైలో సొంతిల్లు కూడా లేదు. ఒక చిన్న కిచెన్‌ రూమ్‌లో అద్దెకుంటున్నాను. దీనికి ఏడు వేల రూపాయలు అద్దె కడుతున్నాను. 2016లో నేను ఓ ప్రమాదంలో గాయపడినప్పుడు సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (CINTAA) రూ.50 వేలు, రైటర్స్‌ అసోసియేషన్‌ లక్ష రూపాయలు ఇచ్చింది. కానీ ఈ సారి నా ఆరోగ్యాన్ని నేను చక్కదిద్దుకునే పరిస్థితిలో లేను. ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే తిరిగి పనిలోకి ఎక్కగానే వారిచ్చిన మొత్తాన్ని ఇచ్చేయాలనుకునేదాన్ని. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల తిరిగి నటిస్తానన్న నమ్మకం లేదు.

ఇక నా కుటుంబం అంటారా! నా దురదృష్టం కొద్దీ నా బాగోగులు చూసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. 25 ఏళ్ల క్రితం నా స్వస్థలమైన ఢిల్లీకి వెళ్లాలనుకున్నా. కానీ నా కుటుంబంలోని ఏ ఒక్కరూ నన్ను వారితో ఉండనిచ్చేందుకు ఇష్టపడలేదు. ఎంతో సంపాదించాను, కుటుంబం కోసం మరెంతో ఖర్చు చేశాను. కానీ ఇప్పుడు ఒంటరినై సాయం కోసం అర్థించాల్సిన దుస్థితికి చేరుకున్నాను" అని నటి ఎమోషనల్‌ అయింది. 

కాగా బుల్లితెర నటి షగుఫ్త అలీ కూడా తన వైద్యం కోసం బంగారు నగలు, కారును అమ్మేసిన విషయం తెలిసిందే. ఆమె గురించి తెలిసిన ప్రముఖ నటి మాధురీ దీక్షిత్‌ డ్యాన్స్‌ దీవానీ 3 టీం తరపున రూ.5 లక్షల చెక్‌ అందించింది. ఇప్పుడు దీనస్థితిలో ఉన్న సవితా బజాజ్‌కు కూడా ఎవరైనా చేయూత అందిస్తే బాగుండంటున్నారు నెటిజన్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement