రామానాయుడు స్టూడియో వద్ద సందడి చేసిన జ్ఞానేశ్వరి, మంగమారిపేటలో కలర్స్ స్వాతి
కొమ్మాది (భీమిలి): విశాఖలో సినిమా షూటింగ్ సందడి తిరిగి మొదలైంది. కోవిడ్ నిబంధనలు సడలించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిస్టులు కూడా విశాఖ చేరుకుంటున్నారు. విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తరువాత జోష్ ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖ నగరం అంటే ప్రకృతి అందాలకు నెలవు. సముద్రానికి పచ్చని కొండలు తోడవడంతో పర్యాటకులతో పాటు సినిమా షూటింగులో కూడా అనువైన ప్రాంతంగా మారింది.
1971 ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ సినీ ఫ్రేమ్‌లో విశాఖను ఆవిష్కరించడంతో నగర అందాలు బయట ప్రపంచానికి తెలిశాయి. యారాడ, అప్పికొండ, ఆర్కే బీచ్, రుషికొండ, తొట్లకొండ, భీమిలి ఇలా భిన్నమైన ప్రకృతి అందాలతో కూడిన ఈ ప్రదేశాలు షూటింగ్ సీన్స్ సినిమాల్లో ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇక సింహాచలం కొండ సెంటిమెంట్‌గా మారడంతో చాలా మంది నటులు కొన్ని సీన్లు అక్కడ తీయాలని పట్టుబడుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవికి కొత్త కేరీర్ విశాఖ ఇచ్చింది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తిమ్మాపురంలో రామానాయుడు స్టూడియో
చాలెంజ్, అభిలాష, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమాలతో విశాఖనగరం చిరంజీవి సినీ చరిత్రనే మార్చేసింది. సర్పయాగం, చామంతి లాంటి సినిమాలు రోజాకు కొత్త సినిమా జీవితాన్ని అందించాయి. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్, లేటెస్ట్ హిట్ అఖండ వరకూ సింహాచలం కేంద్రంగానే షూటింగ్‌లు జరుపుకున్నాయి. ఓటీటీలో అలరిస్తున్న పరంపర చిత్రం మొత్తం విశాఖలోనే చిత్రీకరించారు. ఇక అరకు అందాల గురించి చెప్పనవసరం లేదు. ఆలాపన, స్టేషన్ మాస్టర్, కృష్ణ, ఒక్కడు, కృష్ణగాడి వీర ప్రేమ కథ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాలు ఎన్నో ఇక్కడే ఊపిరి పోసుకున్నాయి. బీచ్‌ను ఆనుకునే ఉన్న రామానాయుడు స్టూడియోలో జరిగే ఒడిశా, బెంగాలీ లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. కోవిడ్ అనంతరం ఇప్పుడు విశాఖలో సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతున్నాయి.
సాగర్‌నగర్‌లో రాజేంద్రప్రసాద్
తీరంలో తారల సందడి
ప్రస్తుతం తీర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్‌లలో తారలు సందడి చేస్తున్నారు. ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, బెల్లంకొండ శ్రీనివాస్, కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర వంటి తారలతో పాటు నూతన నటీనటులు జ్ఞానేశ్వరి, విజయ్ వంటి నటులు ఎంతమందో ప్రస్తుతం ఇక్కడ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దీంతో పాటు ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్‌లు, సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎందరో నటీనటులు నగరంలో సందడి చేస్తున్నారు.
షూటింగ్‌లకు అనువైన ప్రాంతం భీమిలి
సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రాంతం భీమిలి. అప్పట్లోనే తెలుగు సినిమా షూటింగులకు బీజం పడింది. 1962లో అక్కినేని, కృష్ణ కుమారి నటించిన కులగోత్రాలు సినిమా షూటింగ్ ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి కొండపై ఈ సినిమాలో పెళ్ళి దృశ్యాన్ని తెరకెక్కించారు. 1972లో విశాఖ నుంచి భీమిలి మధ్య బీచ్ రోడ్డు నిర్మించటంతో భీమిలి అందాలు అప్పటి నుంచి ఇప్పటివరకు వెండి తెరపై కనువిందు చేస్తున్నాయి.
అంతే కాదు విశాఖ అందాలకు ముగ్ధుడైన జం«ధ్యాల పదికి పైగా సినిమాలను ఇక్కడే నిర్మించారు. 1978లో ప్రఖ్యాతి దర్శకుడు కె.బాలచందర్ భీమిలిలో పలు చిత్రాలను చిత్రీకరించారు. అప్పటి నుంచి మద్రాసు, హైదరాబాద్ తరువాత షూటింగులకు అనుకూలమైన ప్రాంతంగా విశాఖ–భీమిలి గుర్తింపు పొందింది. అంతులేనికథ, మరోచరిత్ర, గుప్పెడు మనసు, నాలుగు స్తంభాలాట, ఆరాధన, అభిలాష, కోకిలమ్మ, నిప్పురవ్వ వంటి సినిమాలు హిట్ కావడంతో విశాఖలో షూటింగ్ చేస్తే సినిమా బాక్సాఫీస్ కళకళలాడుతుందన్న సెంట్‌మెంట్ ఇప్పటికీ కొనసాగుతోంది.
విశాఖ తీరంలో షూటింగ్ జరిపితే కచ్చితంగా హిట్ అన్న సెంట్‌మెంట్ బలంగా ఉండడంతో దర్శక నిర్మాతలు భీమిలికి క్యూ కడుతున్నారు. భీమిలి బీచ్ నుంచి యారాడ బీచ్ వరకు నిత్యం ఎన్నో షూటింగ్‌లు ప్రస్తుతం జరుపుకుంటున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ఆర్‌కే బీచ్, రుషికొండ బీచ్, మంగమారిపేట, ఎర్రమట్టి దిబ్బలు, రామానాయుడు స్టూడియో, భీమిలి బీచ్‌లలో చిత్రీకరణలు ఎక్కువ కొనసాగుతున్నాయి.
బుల్లితెర నుంచి వెండితెర వరకూ..
ప్రస్తుతం ఈ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సినిమా షూటింగ్ సందడి కనపడుతోంది. షార్ట్ ఫిల్మ్‌ల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలవరకు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఫొటో షూట్‌లు, వెడ్డింగ్ షూట్స్, షార్ట్ ఫిల్మ్స్,వెబ్ సిరీస్ , టివి సీరియల్స్, డాక్యుమెంటరీల చిత్రీకరణతో నిత్యం ఈ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment