
విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి స్వాగతించారు. తెలుగు ప్రజల అభిమతం, అకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ పంథాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’అవార్డు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. పాదయాత్ర సందర్భంగా నాడు వైఎస్ జగన్ ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా నిలబెట్టుకున్నారంటూ కృష్ణా జిల్లా వాసులు, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో సంబరపడుతున్నారు.