
సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్
కాటారం: తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం రాబందుల్లా దోచుకుతింటూ సొంత ఆస్తులు పెంచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంథని గోస బీజేపీ భరోసా పేరిట బీజేపీ రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి కాటారం సబ్ డివిజన్ పరిధిలో చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర ముగింపు సభ శుక్రవారం కాటారం మండలకేంద్రంలోని ఎల్‌జీ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండి సంజయ్ హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి, కుంభకోణాలతో కూడిన పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో కేసీఆర్‌కు ప్రయోజనం తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రాజెక్ట్ పేరిట కేసీఆర్ లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. అవినీతి పైసలతో కేసీఆర్, ఆయన కుటుంబం లుచ్చా, లఫంగి దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేసీఆర్ మొగ్గుచూపుతూ ఆ అపవాదును కేంద్రంపై రుద్దాలని కుట్రలు పన్నుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌ను ప్రైవేట్ సంస్థకు ఎలా కట్టుబెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డబుల్ బెడ్‌రూంతో పాటు ఏ ఇతర హామీని నెరవేర్చని అసమర్ధుడు కేసీఆర్ అన్నారు. కేంద్రం రైతుల మోటార్ల కు మీటర్లు పెడుతుందని కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. మీటర్ల బిగింపునకు లోన్ ఇవ్వాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసింది నిజమా కాదా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్‌కు తనను విమర్శించే అర్హత లేదన్నారు. అయ్య కేసీఆర్ మందుకు, కొడుకు కేటీఆర్ డ్రగ్స్‌కు బానిసలని ఆరోపించారు. మంథనిలో గతంలో జరిగిన లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసును ప్రభుత్వం మూసివేయాలని చూస్తుందన్నారు. రానున్నది బీజేపీ ప్రభుత్వం అని ప్రతిదానిపై పూర్తిస్థాయి విచారణ జరిపి ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్ ను బొందపెట్టి బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు కార్యకర్తలు సంజయ్‌కి కత్తి, టోపి బహుకరించగా కత్తి చేతబూని ప్రదర్శించారు.
బండి సంజయ్‌కి ఘన స్వాగతం..
రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్‌కి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి బండి సంజ య్ పూలమాల వేసి నివాళ్లర్పించారు. బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ప్రధాన కూడలి నుంచి ఎల్‌జీ గార్డెన్స్ వరకు బండి సంజయ్ పాదయాత్రగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్, మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి, రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, నాయకులు పాపయ్య, దుర్గం తిరుపతి, ఉదయప్రతాప్, రావుల రాంనాథ్, బండం వసంతరెడ్డి, ఉడుముల విజయారెడ్డి, ఆకుల శ్రీధర్, బొమ్మన భాస్కర్‌రెడ్డి, పాగె రంజిత్‌కుమార్, పూసాల రాజేంద్రప్రసాద్, గంట అంకన్న పాల్గొన్నారు.
ఎటు చూసినా
అవినీతి కుంభకోణాలే
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట
రూ.లక్షల కోట్ల దోపిడీ
బీఆర్‌ఎస్‌ను బొందపెట్టి,
బీజేపీకి పట్టంకట్టాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment