రూ.కోట్ల ఆదాయం ఉన్నా.. సౌకర్యాలు నిల్
● తాగునీరు, మరుగుదొడ్లు కరువై అవస్థలు
● డోనర్ డొనేట్ చేసినా..
మూలనపడిన వాటర్ ప్లాంట్
● పట్టించుకోని దేవాదాయశాఖ
అధికారులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారానికి రూ.కోట్ల ఆదాయం వస్తున్నా దేవాదాయశాఖ అధికారులు భక్తులకు మౌలిక వసతులు కల్పించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంతో పాటు నిత్యం ఏడాది పొడవునా అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తులు అమ్మవార్లకు సమర్పించిన కానుకల ద్వారా సుమారుగా గత నాలుగైదు జాతరల నుంచి రూ.12కోట్లకుపైగా ఆదాయం వస్తుంది. అంతేకాకుండా ప్రతీమూడు నెలలకోసారి హుండీ అదాయం రూ.50లక్షలకు పైనే వస్తోంది. ఇలా వచ్చిన ఆదాయంలో పూజారులకు 1/3 వాటా పోనూ మిగితా ఆదాయం దేవాదాయశాఖ ఖాతాలోకి వెళ్తుంది. కానీ భక్తులకు కావాల్సిన సౌకర్యాల కల్పనపై దేవాదాయశాఖ అధికారులకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
అధ్వానంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు
అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో భక్తులు ఒకటి, రెంటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎండోమెంట్ ఆవరణలోని గదుల వెనుకల వాష్ గదులు, మరుగుదొడ్లు మరమ్మతులకు వచ్చి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. దేవాదాయశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో మరుగుదొడ్ల తలుపులు ఊడిపోవడంతో పాటు వాటర్ సప్లయ్ కూడా లేకుండా పోయింది. దేవాదాయ శాఖలో పని చేస్తున్న సిబ్బంది కూడా ఒకటి, రెంటికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండోమెంట్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్ల మెంటనెన్స్‌ను కూడా అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు మినరల్ వాటర్ తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఇంతకు ముందు దేవాదాయశాఖ కమిషనర్‌గా పనిచేసిన అనిల్‌కుమార్ పట్టుదలతో హైదారాబాద్‌కు చెందిన దాత సాయంతో రూ. 5లక్షల మినరల్ వాటర్ ప్లాంట్ మిషనరీని ఫిబ్రవరిలో జరిగిన మహాజాతర అనంతరం మేడారం దేవాదాయశాఖకు అందజేశారు. దేవాదాయాశాఖ అధికారులు ప్లాంట్ ఏర్పాటు చేసి భక్తులకు మినరల్ వాటర్ అందించాల్సి ఉండగా ఆదిశగా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. వాటర్ కోసం బోరు నిర్మించి నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో ప్లాంట్ మిషనరీ మూలన పడి తుప్పు పట్టిపోతుంది.
మేడారంలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులు
మూలనపడిన వాటర్ ప్లాంట్
Comments
Please login to add a commentAdd a comment