ములుగు రూరల్: మండల పరిధిలోని లక్నవరం ముంపు గ్రామాల్లో సాగు చేసిన పంటలకు ఎస్సారెస్పీ నీళ్లు అందించాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అమ్జద్‌పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం ఏజెన్సీ రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాలు రాయినిగూడెం, పంచోత్కులపల్లి, లాలయగూడెం, జగ్గన్నగూడెం, అంకన్నగూడెం, కొత్తూరు, దుబ్బగూడెం, సర్వాపూర్, కన్నాయిగూడెం గ్రామాలలో యాసంగి వరి పంట చేతికి వచ్చే సమయంలో నీరు అందక పంట ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. యాసంగి సాగు చేసిన రైతులకు 20 రోజుల పాటు ఎస్సారెస్పీ నీళ్లు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తవిటి నారాయణ, కృష్ణ, సాంబయ్య, పాపయ్య, నాగయ్య, సమ్మయ్య, స్వామి, సురేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.