
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
గోవిందరావుపేట: వైద్యం కోసం వచ్చే రోగులను ఆప్యాయతతో పలకరించి మెరుగైన వైద్య సేవలను అందించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్ రావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, దుంపెల్లిగూడెం ఉప కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ కోల్డ్ పాయింట్, వ్యాక్సిన్ నిల్వలు, టెంపరేచర్ రిజిస్టర్, ఐస్ ఫ్యాక్స్, వ్యాక్సిన్ వీవీఎంను పరిశీలించారు. డ్యూలిస్ట్ ప్రకారము వ్యాక్సిన్‌ను ఉప కేంద్రాలకు పంపిణీ చేయాలని ఫార్మసిస్ట్‌లకు తెలిపారు. అనంతరం మండల వైద్యాధికారి చంద్రకాంత్, సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాలను పిల్లలకు సమయానుగుణంగా ఇవ్వాలన్నారు. టీకాలు ఇచ్చే కేంద్రం వివరాలను ఒకరోజు ముందుగానే ఆశ కార్యకర్తలు పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ఉపాధిహామీ పనులు జరుగుతున్న వివరాలను తెలుసుకుని కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందించాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి చంద్రకాంత్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు