అందని ‘భరోసా’..
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు
●
ఇప్పట్లో వస్తాయన్న
నమ్మకం లేదు..
నాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో రెండు ఎకరాల్లో మొక్కజొన్న, మరో ఎకరంలో వరి సాగుచేస్తున్నా. ఇప్పటికే నాట్లు వేసుకున్నా. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందలేదు. గత వానాకాలం సీజన్‌లో కూడా ఇవ్వలేదు. ఇప్పట్లో ఇస్తదన్న నమ్మకం కూడా కుదరడం లేదు. ప్రభుత్వం సకాలంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలి.
– చిటమోని సుధాకర్,
గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం
పొలంలో పనిచేస్తున్న రైతు
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
13,23,813 మంది అర్హులు
● ఇప్పటివరకు భరోసా ఇచ్చింది 57,914 మందికే..
● మండలానికి ఒక్క గ్రామ
రైతులకే సొమ్ము జమ చేసిన ప్రభుత్వం
● మిగతా వారికి ఎప్పుడన్నదానిపై
స్పష్టత కరువు
వెయ్యి కళ్లతో
ఎదురుచూస్తున్నాం..
నాకు రెండెకరాల పొలం ఉంది. రైతుభరోసా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం. ఈ నెల 26 నుంచి రైతుభరోసా డబ్బులు ఖాతాలో పడతాయని చెప్పినా ఇంతవరకు మా తండాలో ఒక్క రైతుకు కూడా డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో రెండెకరాలకు రూ. 20వేల పంట పెట్టుబడి సాయం అందేది. ఇప్పుడు డబ్బులు వచ్చేదాక నమ్మకం లేదు.
– సభావట్ పూల్యానాయక్, రైతు,
గుట్టమీదితండా, ఉప్పునుంతల
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రభుత్వం రైతుభరోసా కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం కొందరికే అందింది. మండలానికి ఒక్క గ్రామం చొప్పున ఎంపిక చేసి ఆ గ్రామంలోని రైతులకే ప్రభుత్వం భరోసా కింద ఆర్థికసాయాన్ని అందజేసింది. ఇంకా సాయం అందాల్సిన వారు పెద్దసంఖ్యలో ఉండటంతో తమ వంతు ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎ దురుచూస్తున్నారు. అయితే ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ఎప్పటి నుంచి ప్రభుత్వ సాయం అందుతుందన్న దానిపై స్పష్టత కరువైంది.
రైతు భరోసా పథకం కింద ఈసారి ప్రభుత్వం ఒక్కో ఎకరాకు తొలి విడతలో రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ నెల 26న రైతుభరోసా పథకాన్ని ప్రారంభించినా, ఆ రోజున బ్యాంకులకు సెలవు కావడంతో 27న ఉదయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమైంది. అర్హులైన రైతులందరికీ ఒకేసారి కాకుండా, మండలానికి ఒక గ్రామం చొప్పున అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13,23,813 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా తేలగా, ఇప్పటి వరకు ప్రభుత్వ సాయాన్ని అందించింది 57,914 మందికే. కేవలం 5శాతం లోపు రైతుల మాత్రమే సాయాన్ని అందుకోగా, ఇంకా పెద్ద సంఖ్యలో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో వ్యవసాయానికి ఆర్థికసాయాన్ని అందించాలని కోరుతున్నారు.
మండలానికో గ్రామమేనా..
మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసం. మా కుటుంబానికి నాలుగెకరాల భూమి ఉంది. అందులో వరి పంట సాగు చేశాను. రైతు భరోసా వస్తుందనే నమ్మకంతోనే వడ్డీపై డబ్బులు తీసుకువచ్చా. ఇంతవరకు పెట్టుబడి సాయం అందలేదు. నాతో పాటు గ్రామంలో చాలామంది రైతు భరోసా రాకపోవడంతో సాగు కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకులలో అప్పులు చేయాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో సీజన్ ప్రారంభానికి ముందే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడేవి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తర హాలో అందరికీ ఒకేసారి వస్తే బాగుంటుంది.
–దొబ్బలి మొగులయ్య, రామచంద్రాపూర్, మహబూబ్‌నగర్ రూరల్
ఉమ్మడి జిల్లాలో రైతుభరోసా పథకం వివరాలు: (రూ. కోట్లలో)
జిల్లా అర్హులైన మొత్తం సాయం పొందిన జమ చేసిన
రైతులు డబ్బులు రైతులు డబ్బులు
మహబూబ్‌నగర్ 2,50,239 276.09 14,526 17.23
నాగర్‌కర్నూల్ 3,30,836 451.26 16,806 23.01
వనపర్తి 3,68,799 442.56 9,415 12.21
జోగుళాంబ గద్వాల 1,81,919 278.80 7,819 12.45
నారాయణపేట 1,92,020 275.18 9,348 13.87
కసరత్తు కొనసాగుతోంది..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతుభరోసా కింద ఇప్పటివరకు ప్రతి మండలంలో ఎంపికచేసిన గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో ప్రభుత్వ సాయం జమ అయింది. మిగతా గ్రామాల్లోనూ వ్యవసాయ యోగ్యమైన భూములపై కసరత్తు ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే రైతులందరికీ సాయం అందుతుంది.
– చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, నాగర్‌కర్నూల్
రైతుభరోసా పథకంతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సాయానికి సైతం రైతు కూలీలు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు సైతం ఏటా రూ.12 వేలు ఆర్థికసాయాన్ని అందిస్తామని చెబుతోంది. ఇప్పటివరకు మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లోని లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,180 మందికి జమ చేశామని ప్రభుత్వం చెబుతుండగా, ఉమ్మడి జిల్లాలో ఈ సంఖ్య వందలకే పరిమితమైంది. ఆత్మీయ భరోసా కింద సాయం పొందేందుకు ఉపాధి హామీ పథకంలో పని చేయాలన్న నిబంధన పెట్టడంతో చాలామంది నిరుపేదలు ఈ పథకానికి దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిబంధనను సడలించి, భూమిలేని రైతుకూలీలు అందరికీ ఇవ్వాలని కోరుతున్నారు.
5 శాతం లోపు రైతులకే..
‘ఆత్మీయ’తకు దూరమే..
Comments
Please login to add a commentAdd a comment