పదేళ్ల కాలంలో ‘గువ్వల’ చేసిందేమీ లేదు | - | Sakshi
Sakshi News home page

పదేళ్ల కాలంలో ‘గువ్వల’ చేసిందేమీ లేదు

Published Thu, Jan 30 2025 1:44 AM | Last Updated on Thu, Jan 30 2025 1:43 AM

పదేళ్ల కాలంలో ‘గువ్వల’ చేసిందేమీ లేదు

పదేళ్ల కాలంలో ‘గువ్వల’ చేసిందేమీ లేదు

నాగర్‌కర్నూల్‌: ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించడం.. నల్లమలలో గుంతలు తవ్వడం తప్ప అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పదేళ్ల కాలంలో చేసిందేమీ లేదని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆయనను గుంతల బాలరాజుగా అభివర్ణించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో గువ్వల బాలరాజు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఖండించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలన్నారు. డబుల్‌బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, దళితుడిని సీఎం చేస్తామన్న హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ దత్తత తీసుకున్న పాలమూరుకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలోనూ గువ్వల బాలరాజు 30 గ్రామాలను దత్తత తీసుకుని చేసిందేమీ లేదన్నారు. నల్లమలలో గుప్తనిధుల కోసం గుంతలు తవ్వుతుంటే.. నాలుగుసార్లు పట్టుకున్నామన్నారు. సొంత పార్టీ నాయకులనే కొట్టిన చరిత్ర గువ్వలదని అన్నారు. ఎవరిని ఎవరు కొట్టించారో తన వద్ద జాబితా ఉందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌, భూముల ఆక్రమణ, సీడీఎఫ్‌ నిధుల లెక్కలన్నీ ప్రజల ముందుంచుతామన్నారు. అచ్చంపేటలో ఏ పదవులను ఎంతకు అమ్ముకున్నాడో తన వద్ద లెక్కలున్నాయన్నారు. కరోనా సమయంలోనూ రూ. కోట్లు వసూలు చేశారని.. కార్యకర్తల వద్ద రూ.25 కోట్ల అప్పుచేసి ఎగ్గొట్టాడని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో మందకృష్ణను 40 రోజుల పాటు జైలుపాలు చేస్తే సమర్థించిన వ్యక్తి.. ఇప్పుడు కులరాజకీయాలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో ఓ విద్యార్థిని చనిపోతే రాత్రికి రాత్రే తీసుకెళ్లి ఖననం చేయించిన వ్యక్తికి దళితుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిది కుటుంబ పాలన అని మాట్లాడుతున్న గువ్వల బాలరాజు.. సీఎం ఇంట్లో ఎన్ని పదవులు ఉన్నాయో చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు అచ్చంపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణంపై ఒక కాగితం తెచ్చి చేతులు దులుపుకొంటే.. తాను ఆ ప్రాజెక్టు కోసం రూ. 2,367 కోట్లు మంజూరు చేయించానని ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రితో శంఖుస్థాపన చేయిస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉమామహేశ్వరస్వామి ప్రభోత్సవం రోజున కేవలం తనకు ఆహ్వానం పలకలేదని ధర్నాచేసి.. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడం జరిగిందన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తాను ఇలాంటి రాజకీయాలు చేయలేదన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని

అచ్చంపేటలో దౌర్జన్యాలు

త్వరలోనే అన్ని లెక్కలు తేలుస్తాం

డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement