ఆదివాసీ చెంచుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి
మన్ననూర్: ఆదివాసీ చెంచుల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నల్లమలలోని చెంచు పెంటల్లో త్వరలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా బుధవారం ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ, డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డితో కలిసి దోమలపెంటలోని వన మయూరి అతిథిగృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచు పెంటల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. చెంచు గూడాలు, పెంటల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, పక్కా గృహాలు, తాగునీరు, రోడ్డు సౌకర్యం వంటి కనీస అవసరాలను మెరుగు పరిచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అప్పాపూర్ గ్రామ పంచాయతీలోని పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమల్కల తదితర పెంటల్లో నివాసం ఉంటున్న చెంచులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా చెక్‌డ్యాంలు, తాగునీటి బావులు తవ్వించాలని సూచించారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, కరెంటు, విద్యార్థులు తరగతి గదిలో కూర్చునేందుకు బేంచీలు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా చెంచు పెంటల్లోని ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో మిషన్ భగీరథ డీఈ హేమలత, ఆర్‌డబ్ల్యూఎస్, గిరిజన కార్పొరేషన్ మేనేజర్ సంతోష్‌కుమార్, డీటీడీఓ ఫిరంగి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ బదావత్ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment