ఆక్సిజన్ కొరతకు చెక్
జనరల్ ఆస్పత్రిలో 10వేల కిలోల ప్లాంటు ఏర్పాటు
ఇబ్బందులు రానివ్వం..
జనరల్ ఆస్పత్రికి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు ఆక్సిజన్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం 10 వేల కిలోల సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా 135 పడకలకు ఆక్సిజన్ పాయింట్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాం. ఆక్సిజన్ ప్లాంటును ఆన్‌లైన్ విధానం ద్వారా పర్యవేక్షణ చేయనున్నాం.
– రఘు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
● ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా 135
పడకలకు సదుపాయం
● వినియోగంపై ఆన్‌లైన్
విధానంలో పర్యవేక్షణ
● జిల్లావ్యాప్తంగా రోగులు
వస్తుండటంతో పెరిగిన డిమాండ్
● సివిల్ ఆస్పత్రుల్లోనూ ఏర్పాటుకు వేడుకోలు
నాగర్‌కర్నూల్ క్రైం: అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో వైద్యం కోసం చేరే రోగులకు ఆక్సిజన్ ఎంతో అవసరం ఉంటుంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా జనరల్ ఆస్పత్రిలో నాణ్యమైన ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ ప్రాధాన్యత ఎంతగానో అవసరం ఉండటంతో జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఐదేళ్లు సేవలు అందించినప్పటికీ కొద్దిరోజులుగా ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతుకు గురవడంతోపాటు విద్యుత్ నిర్వహణ భారం ఎక్కువగా కావడంతో వాటి స్థానంలో 10 వేల కిలోల భారీ ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి సేవలను వినియోగంలోకి తీసుకురానున్నారు.
330 పడకల సామర్థ్యం
జనరల్ ఆస్పత్రిలో కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ వినియోగంలో లేకపోవడంతో రోగులకు సేవలు అందించేందుకు ప్రైవేటు సంస్థల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే అందులో నాణ్యత ఉండకపోవడంతో ప్రత్యామ్నాయంగా జనరల్ ఆస్పత్రి ఆవరణలోనే 10 వేల కిలోల ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక ట్యాంకర్ ద్వారా ఆక్సిజన్‌ను తీసుకువచ్చి ట్యాంక్‌లో నింపి రోగులకు అందించనున్నారు. ఈ క్రమంలో 330 పడకల సామర్థ్యం కలిగిన జనరల్ ఆస్పత్రిలో ఐసీయూ, జనరల్ వార్డు, ఆర్థోపెడిక్ వార్డు, గర్భిణుల వార్డుతోపాటు చిల్డ్రన్స్ వార్డులకు ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా 135 ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేసి ఆక్సిజన్ సేవలు అందించనున్నారు. అదేవిధంగా 10 వేల కిలోల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్‌లో ఆక్సిజన్ నిల్వలతోపాటు వినియోగాన్ని ఆన్‌లైన్ విధానం ద్వారా పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
సివిల్ ఆస్పత్రుల్లోనూ..
జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట సివిల్ ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులో లేకపోవడంతో సిలిండర్ల ద్వారానే రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో కల్వకుర్తి, అచ్చంపేట సివిల్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంటు పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక సేవలు అందించేందుకు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరంతరం అందుబాటులో ఉండటంతో జిల్లాలోని సివిల్, కమ్యూనిటీ ఆస్పత్రుల నుంచి అత్యవసర సేవల కోసం జనరల్ ఆస్పత్రికి వస్తుండటంతో ఆక్సిజన్ వినియోగం పెద్దమొత్తంలో అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో కల్వకుర్తి, అచ్చంపేట సివిల్ ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకువస్తే రోగులకు ఇబ్బంది ఉండదని, స్థానికంగానే మెరుగైన వైద్యసేవలు అందుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆక్సిజన్ కొరతకు చెక్
ఆక్సిజన్ కొరతకు చెక్
Comments
Please login to add a commentAdd a comment