
వైభవంగా ఎదుర్కోళ్ల ఉత్సవం
బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం స్వామివారి ఎదుర్కోళ్ల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల మూడోరోజు ప్రాతారాధన, చతుస్థానార్చన, సేవాకాలం, బాలభోగ నివేదన, పూర్ణాహుతి, బలిప్రదానం, ఉత్సవ మూర్తులకు నవకళశ స్నపన తిరుమంజనం తదితర కార్యక్రమాలు జరిపారు. అనంతరం అనంతరం స్వామివారికి ఎదుర్కోళ్ల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తర్వాత హనుమద్వాహన సేవతో పూజ పూర్తి చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణం ఉంటుందని, ఈ కార్యక్రమం కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధాన అర్చకుడు శ్రీమన్నారాయణాచార్యులు తెలిపారు.
కనులపండువగా
ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, శశాంక్ స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మహాహోమం నిర్వహించి స్వామివారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, ధీరేంద్రదాసు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో 1,018 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం 1,018 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని వివరించారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 187 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 126 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు.
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
అమరచింత: ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు కె.సూర్యం ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మార్క్స్ భవనంలో ఉమ్మడి మండలాల మాస్‌లైన్ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక, కర్షక చట్టాలకు వ్యతిరేకంగా నడుచుకుంటుందన్నారు. మోదీ ప్రభుత్వం అదాని, అంబానీలాంటి కార్పొరేట్ యాజమానులకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారి వ్యవస్థలు నడుపుకోవడానికి రాయితీలు ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌కు అప్పజెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని.. ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని నెరవేర్చలేకపోతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment