
తప్పని వెతలు
ఎండలో విధులు..
వడగాలుల నడుమ ట్రాఫిక్ పోలీసుల విధులు
ఒకవైపు పోటెత్తిన వాహనాలు.. మరోవైపు నిప్పులు కురిసేలా ఎండ..
ఒక్క క్షణం ఆదమరిచినా ముంచుకొచ్చే ప్రమాదాలు. ఎండల్లో ట్రాఫిక్ పోలీసుల విధి
నిర్వహణ కత్తిమీద సామే. నిప్పుల కుంపటిపై నిల్చొని పని చేస్తున్నట్లు ఉన్నా.. వేడి గాలులు వీస్తున్నా..
వడదెబ్బలు తగులుతున్నా.. విధి నిర్వహణలో
అప్రమత్తంగా ఉంటున్నారు.
– మహబూబ్‌నగర్ క్రైం/
నాగర్‌కర్నూల్ క్రైం
ఉదయం 8 గంటల నుంచే ఎండ దంచికొడుతోంది. ప్రస్తుతం దాదాపు 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి.. కానీ ట్రాఫిక్ పోలీసులకు సెగలు కక్కుతున్న ఎండలో విధులు కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలతో రోడ్లపై విధులు నిర్వహించే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నా సమర్థవంతంగా వారి బాధ్యతలు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏకై క ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ మహబూబ్‌నగర్‌లో ఉండగా.. ఇక్కడ మొత్తం 55 మంది పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో ఒక సీఐతో పాటు ఇద్దరూ ఎస్‌ఐలు, ఒక ఏఎస్‌ఐ, 12 మంది హెడ్‌కానిస్టేబుల్స్, 32 మంది కానిస్టేబుల్స్, ఏడుగురు హోంగార్డులు ఉన్నారు. మిగతా జిల్లాలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ లేనప్పటికీ ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వనపర్తి జిల్లాలో ఏఆర్ ఎస్‌ఐ, ఏఎస్‌ఐ,12 మంది కానిస్టేబుల్స్, నలుగురు హోంగార్డులు, గద్వాల జిల్లాలో ఒక ఏఆర్ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది హోంగార్డులు, నాగర్‌కర్నూల్‌లో ఒక ఎస్‌ఐ, ఒక ఏఎస్‌ఐ, నలుగురు హోంగార్డులు, ఆరుగురు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ట్రాఫిక్ విభాగంలో 102 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను బట్టి రెండు షిఫ్ట్‌లుగా విభజించి విధులు కేటాయిస్తున్నారు. మొదటి షిప్ట్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో షిప్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్‌లోని పిస్తాహౌస్, మెట్టుగడ్డ, న్యూటౌన్, సుభాష్ చంద్రబోస్ సర్కిల్,, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీస్, పాత బస్టాండ్, వన్‌టౌన్ చౌరస్తా, తెలంగాణ కూడలి, పాన్‌చౌరస్తా, గాంధీచౌక్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఉంటుంది. వనపర్తిలో ఇందిరాపార్క్, రాజీవ్ చౌరస్తా, కొత్త బస్టాండ్, గాంధీ చౌక్, నారాయణపేటలోని సత్యనారాయణ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్, మెయిన్ చౌక్, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఇన్‌గేట్, ఔట్‌గేట్ వద్ద, శ్రీపురం చౌరస్తా, రవీంద్రటాకీస్ చౌరస్తా, గద్వాలో పాత బస్టాండ్, కృష్ణవేణి చౌరస్తా, పాత కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్, సుంకులమ్మ మెట్టు వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.
అధిక వేడి వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం
ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు
పాలమూరులో క్యాప్‌లు, కూలింగ్ అద్దాలు,
వాటర్ బాటిల్స్ పంపిణీ