మిర్యాలగూడ అర్బన్ : మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ మహిళా కౌన్సిలర్ బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని 25వ వార్డు కౌన్సిలర్, శివాని హైస్కూల్ చైర్మన్ కుందూరు నాగలక్ష్మి(45) తన భర్త కుందూరు శ్యాంసుందర్‌రెడ్డితో కలిసి స్కూల్ హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తులో నివాసముంటున్నారు. తన భర్తతో కలిసి గురువారం రాత్రి ఓ వివాహ వేడుకలకు హాజరై రాత్రి పొద్దుపోయాక తిరిగి వచ్చారు.
అనంతరం తన గదిలోకి వెళ్లి నిద్రించిన ఆమె శుక్రవారం ఉదయం బయటకు రాలేదు. రోజువారీ పనుల్లో భాగంగా శ్యాంసుందర్‌రెడ్డి బయటకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు. బెడ్‌రూం తలుపు వేసి ఉండటంతో ఎంతకు తలుపు రాలేదు. దీంతో అనుమానం వచ్చి తలుపును తెరిచి చూడగా నాగలక్ష్మి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ పి.వెంకటగిరి కౌన్సిలర్ బలవన్మారణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అమెరికాలో ఉన్న తన తమ్ముడు వచ్చే వరకు మృతదేహాన్ని భద్రపరిచేందుకు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నాగలక్ష్మి కొంతకాలంగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోందని, మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి సరోజనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కౌన్సిలర్ మృతితో మిర్యాలగూడలో విషాదం అలుముకుంది.
ఎమ్మెల్యే పరామర్శ
బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కుటుంబ సమేతంగా వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి పంపే వరకు ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రజలు, వివిధ పార్టీల నేతలు చేరుకున్నారు. మృతురాలికి కుమారుడు కేశవ సుదీప్‌రెడ్డి, కూతురు జీవన సంయుక్త ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment