దుక్కి దున్నుతున్న రైతు
నడిగూడెం : రైతు సాగు చేసే ఏ పంటకై నా అదునులోగా విత్తనాలు విత్తుకుంటే మేలని నడిగూడెం మండల వ్యవసాయాధికారి రాజగోపాలరావు చెబుతున్నారు. ఎక్కువ విసీర్ణంలో సాగు చేసే వరి, పత్తి పంటల విత్తనాలు విత్తుకునే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంటల సాగు, విస్తీర్ణం, దిగుబడులు నైరుతి రుతుపవనాల ప్రవేశంపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ వారంలో ప్రవేశించి, మూడో వారం వరకు అంతటా విస్తరిస్తాయి. నైరుతి రుతుపవనాల ప్రవేశం ఆధారంగా వానాకాలంలో పత్తి, కంది, పెసర, ఇతర పంటలను విత్తుకుంటారు.
వర్షాలపై ఆధారపడి పత్తి సాగు
పత్తి విత్తనాలను వర్షాలపై ఆధారపడి విత్తుకోవాలి. తెల్లబంగారం సాగు చేసే రైతులు ఏటా అదే పొలంలో పత్తిని పండించకుండా పంట మార్పిడి చేయాలి. విత్తనాలను మొక్కకు మధ్య 2అడుగులు వరుస వరుసకు 2 అడుగులు లేదా మొక్కకు 3అడుగుల దూరంలో వరుస వరుసకు 3 అడుగుల దూరంలో విత్తుకోవడం ద్వారా సాంద్రతను పెంచి అధిక దిగుబడులు పొందవచ్చు. నల్లరేగడి భూముల్లో 60–70 మి.మీ. ఎర్ర చెల్క భూముల్లో 50–60 మి.మీ. వర్షపాతం నమోదైనప్పుడు విత్తుకోవాలి. జూలై 15లోగా విత్తుకుంటే ఆశించిన దిగుబడులు పొందవచ్చు.
సిఫారసు చేసిన భాస్వరం మొత్తాన్ని సింగిల్‌సూపర్ పాస్పేట్ రూపంలో 150కిలోలు ఆఖరు దుక్కిలో విత్తేటప్పుడు వాడాలి. మెగ్నిషియం, బోరాన్ తదితర సూక్ష్మదాతులోప నివారణకు మెగ్నిషియం పది గ్రాములు, బోరాన్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు మందులైన ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు లేదా థయోమితాక్సోం 4 గ్రాములు, తెగుళ్ల నివారణకు వినియోగించే ట్రైకోడెర్మా విరిడే 10 గ్రాములు, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 10 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. ప్రైవేట్ హైబ్రిడ్ విత్తనాలైతే శిలీంద్రనాశిని మందులు కార్బక్సీన్ థైరమ్ 25 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. అంతరపంటగా కందిని ఆరు లేదా ఎనిమిది వరుసలకు విత్తుకోవాలి.
జూలై 15లోగా విత్తుకోవాలి..
కంది, పెసర పంటలను ఈ నెల 15 నుంచి జూలై 15లోగా విత్తుకోవాలి. పంట మార్పిడి పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. కంది తర్వాత జొన్న, మినుము, ఉలువలు నువ్వులు తదితర పంటలు సాగు చేసుకోవచ్చు. పురుగులు, తెగుళ్లు తట్టుకొనే రకాలు సాగు చేసుకోవాలి. కంది పంట చుట్టూ అక్కడకక్కడ బంతి మొక్కలు నాటుకోవాలి. బంతి పూలకు శనగపచ్చ పురుగు ఆకర్షణ చెంది పూలపై గుడ్లను పెడుతుంది. మొక్కజొన్న, పెసర, మినుము తదితర పంటలు సాగు చేసేవారు జూలై 15 లోగా విత్తుకోవడం పూర్తి చేసుకోవాలి.
వరి సాగుకు అనుకూలమైన సమయం
దీర్ఘకాలిక రకాలైన బీపీటీ–5204 ఇంకా ఇతర సన్న రకాలు ఇప్పటి నుంచి జూన్ నెలాఖరులోగా నారు పోసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలైతే జూన్ 20నుంచి, జూలై 15వరకు నారు పోసుకోవచ్చు. ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకం కొంత ఆలస్యమైనా పోసుకొనేందుకు అనువైంది.
Comments
Please login to add a commentAdd a comment