మిర్యాలగూడ: ప్రేమోన్మాది వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన దామరచర్ల మండంలోని గణేష్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. బుధవారం దామరచర్ల ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్‌పహాడ్ గ్రామానికి చెందిన కొర్ర రెడ్యా, విజయ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. మూడో కుమార్తె కొర్ర స్వాతి(17) సూర్యాపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మెగావత్ హుస్సేన్ ఐటీఐ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. హుస్సేన్ గత కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో స్వాతిని వేధిస్తున్నాడు.
తరచూ ఫోన్లు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వాతి తన తల్లిదండ్రులకు చెప్పగా వారు హుస్సేన్‌ను మందలించారు. అయినా తీరు మారని హుస్సేన్ స్వాతిని ప్రేమ పేరుతో వేధించసాగాడు. దీంతో విసుగు చెందిన స్వాతి సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయి గణేష్‌పహాడ్ గ్రామ పరిధిలో కృష్ణా నది ఒడ్డున గల పంప్‌హౌజ్ పైనుంచి కిందకు నదిలోకి దూకింది.
స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం కృష్ణా నదిలో స్వాతి మృతదేహం లభ్యమైంది. నిందితుడు హుస్సేన్ పరారీలో ఉన్నాడని, అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్వాతి తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment