
సాక్షి ప్రతినిఽధి, నల్లగొండ : విప్లవ కవి, ప్రజా యుద్ద నౌక, ప్రజా గాయకుడు గద్దర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలకు ఊపిరిలూదారు. భువనగిరిలో ఉద్యోగం నుంచి మొదలుకొని ఉద్యమంవైపు నడిచే వరకు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు, ప్రజాస్వామిక ఉద్యమాలన్నింటిలోనూ గద్దర్‌కు జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. పీడిత ప్రజల పక్షాన జిల్లాలో నిర్వహించిన అనేక పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. జిల్లాలో రాజ్యాహింసకు, బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా గళమెత్తారు.
జిల్లాలో జరిగిన అనేక ప్రజాస్వామి ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. ఫ్లోరోసిస్, యురేనియం వ్యతిరేక, రైతాంగ పోరాటాలు, సొరంగమార్గం సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. పులిచింతల ప్రాజెక్టుతో ఆంధ్రాకే మూడు పంటలకు నీరు పోతుందని, తెలంగాణకు ఒక్క పంటకు కూడా నీరందని, దాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇలా జిల్లాలో జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్న గద్దర్‌కు జిల్లాతో విడదీయరాని ఉద్యమ బంధం ఏర్పడింది.
ఫ్లోరోసిస్‌పై పోరాటం
ల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యతో 30 ఏళ్లకే ముసలివారై మృత్యువాత పడుతున్న పరిస్థితులపై గద్దర్ గళమెత్తారు. ఆ సమస్య పరిష్కరించాలంటూ చేసిన ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు కంచుకంట్ల సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్లోరైడ్ విముక్తి ఉద్యమానికి గద్దర్ బాసటగా నిలిచారు. ఫ్లోరోసిస్‌ను పూర్తిగా రూపుమాపేందుకు కృష్ణా జలాలు అందించాలనే డిమాండ్‌తో నిర్వహించిన అనేక పోరాటాల్లో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో 2012లో స్వీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ వచ్చిన సమయంలో గద్దర్ పాల్గొని పరిస్థితిని వివరించారు. చండూరు, మర్రిగూడ మండలాల్లో నిర్వహంచిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫ్లోరైడ్ సమస్యనుంచి బయటపడాలంటే నదీ జలాలే శరణ్యమని, అందుకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పూర్తి చేయాలంటూ జరిగిన ఉద్యమాలకు మద్దతుగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రజలు పడుతున్న గోసలను వివరించి జిల్లా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.
గద్దర్ పోరాటాలు ఇలా..
► 1976 ప్రాంతంలో జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభకు హాజరయ్యారు.
► 1999లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన మారోజు వీరన్న అంత్యక్రియలకు ఆయన స్వగ్రామం తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం వచ్చారు.
► పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం పూనుకోగా దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు గద్దర్. ఆ ప్రాజెక్టు వల్ల ఆంధ్రాకు మూడు పంటలకు నీరందుతుందని, నల్లగొండ జిల్లాకు మాత్రం తాగునీటికి కూడా తిప్పలు తప్పవని చేపట్టిన ఉద్యమాల్లో పాల్గొన్నారు.
► సీపీఎం ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహించిన బీఎల్‌ఎఫ్, అంబేద్కర్ జాతా, టీమాస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
► 1999లో పౌరహక్కుల సంఘం నాయకుడు ఆజాం అలీ హత్య నల్లగొండలో జరిగింది. ఆ సందర్భంలోనూ గద్దర్ వచ్చి ఇది నయీంతో పోలీసులే చేయించారంటూ ఆరోపించారు.
► 1999లో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో జరిగిన బెల్లి లలిత హత్య నేపథ్యంలో, ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమాల్లో గద్దర్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేయించిన హత్యగా అభివర్ణించారు.
► 2009 మే 8న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నరసింహారెడ్డి సంతాప సభకు హాజరయ్యారు.
► కేసీఆర్ ప్రారంభించిన మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ ప్రముఖ పాత్ర పోషించారు. జిల్లాలో జరిగిన తెలంగాణ ధూం ధాం కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావుతోపాటు దుబ్బాక నర్సింహారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన పాదయాత్రను గద్దర్ ప్రారంభించారు. జిల్లాలో జరిగిన రైతాంగ పోరాటాల్లోనూ పాలుపంచుకున్నారు.
► మిర్యాలగూడలో ప్రణయ్ హత్య తర్వాత జరిగిన ఉద్యమంలోనూ గద్దర్ పాల్గొన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
► ఇటీవల సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా జూన్ 27వ తేదీన చివ్వెంల మండలం తిమ్మాపురం, మోదీన్‌పురం, బి.చందుపట్ల గ్రామాల్లో గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు.
వీటితోపాటు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లోనూ గద్దర్ పాల్గొన్నారు. జిల్లాతో ఆయనకు ఉద్యమపరంగా విడదీయరాని బంధం ఉంది.
► దేవరకొండ నియోజకవర్గంలో యురేనియం ప్రాజెక్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజలకు బాసటగా నిలిచారు. యురేనియం ప్రాజెక్టు నిర్మిస్తే దాని ప్రభావం నాగార్జునసాగర్ జలాలపై పడుతుందని, దానివల్ల జీవరాశులకు ప్రమాదం వాటిళ్లుతుందని చేపట్టిన ఉద్యమాల్లో గద్దర్ పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పావురాలగుట్ట (పెద్దచౌడు) గుట్టల్లో ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ నాయకుడు దివాకర్ సహా 11మంది మృతి చెందారు. ఆ సందర్భంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి వచ్చి ఆ కుటుంబాలకు బాసటగా నిలిచారు. ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్ చేసిందని ఆరోపణలు చేసిన గద్దర్, ఎన్‌కౌంటర్ చనిపోయిన నక్సలైట్ల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. దీంతో గద్దర్‌పై నల్లగొండ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో అరెస్టయిన గద్దర్ రెండు రోజులు జైల్లో ఉన్నారు. ఆయనతోపాటు అడ్వకేట్లు జి.వెంకటేశ్వర్లు, జి.మోహన్‌ను కూడా అరెస్టు చేశారు. ఆ తరువాత ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment