జీపీఓ పేరుతో కొత్త పోస్టులు మంజూరు
జీపీఓ పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
గ్రామ పాలనాధికారి పోస్టుల నియామకాల కోసం పూర్వ వీఆర్‌ఏ, వీఆర్‌ఓల్లో తిరిగి మాతృసంస్థకు వచ్చేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి ఈ ఏడాది జనవరిలోనే దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఆహ్వానించింది. జిల్లా వ్యాప్తంగా మంది 370 మంది జీపీఓ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో.. ఎంత మందిని నియమిస్తారనేది ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.
నల్లగొండ : గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలకు రెవెన్యూ సేవలు అందించేలా గ్రామ పాలనాధికారి(జీపీఓ) పేరుతో ఉద్యోగులను నియమించేందుకు సిద్ధమైంది. ఇది వరకు గ్రామాల్లో సేవలందించిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏల వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. తిరిగి వారు పూర్వ సంస్థలో చేరేందుకు అవకాశం కల్పించింది. తిరిగి రెవెన్యూ శాఖలో చేరేందుకు జిల్లా వ్యాప్తంగా 370 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారి నియామకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు కాలేదు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా..
అయితే గత ప్రభుత్వ హయాంలో ఇతర శాఖల్లో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలను సర్దుబాటు చేశారు. ఇందులో 2022 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం 390 మంది వీఆర్‌ఓలు రెవెన్యూతో పాటు 37 శాఖల్లో, 2023 ఆగస్టులో 850 మంది వీఆర్‌ఏలను ఎనిమిది శాఖల్లో సర్దుబాటు చేశారు. దీంతో గ్రామాల్లో భూ సర్వేలు, భూమి హక్కులు, విద్యార్హత ధ్రువపత్రాల జారీ, విచారణలు, సంక్షేమ పథకాల అర్హుల గుర్తింపు, విపత్తుల సమాచారం అందజేయడం, తదితర వాటిపై ప్రభావం చూపింది. ఫలితంగా కొన్నింటిని పంచాయతీ కార్యదర్శులతో చేయిస్తున్నారు. ఆ వ్యవస్థ రద్దయ్యాక.. రెవెన్యూ పరంగా గ్రామాల్లో భూ సమస్యలు, సంక్షేమ పథకాల అర్హుల గుర్తింపు, ఇతర సర్వేలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచేలా ఆర్థిక శాఖ జీపీఓ పోస్టులు మంజూరు చేసింది.
గ్రామాల వారీగానేనా..!
ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థలో మళ్లీ గ్రామ పరిపాలన అధికారులను నియమిస్తోంది. అయితే గ్రామ పంచాయతీల వారీగా నియమిస్తుందా.. లేక రెవెన్యూ గ్రామాల వారీగానా, క్లస్టర్ల వారీగానా అనే విషయం ఇంకా తేలలేదు. గ్రామ పంచాయతీల వారీగా నియమిస్తే జిల్లాలో 844 మంది, రెవెన్యూ గ్రామాల వారీగా అయితే 566 మంది, క్లస్టర్ల వారిగా నియమిస్తే 340 మంది నియమించే అవకాశం ఉంటుంది. ఏ ప్రాతిపదికన నియమిస్తుందనే విషయం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే గతంలో వీఆర్‌ఏలు, వీఆర్‌ఓలు గ్రామాల వారీగా ఉన్నందున అదే విధంగా నియమిస్తారనే చర్చ సాగుతోంది.
ఫ రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి పూనుకున్న ప్రభుత్వం
ఫ పూర్వ వీఆర్‌ఓ, వీఆర్‌ఏలకు అవకాశం
ఫ జిల్లాలో 370 మంది తిరిగి వచ్చేందుకు దరఖాస్తు
ఫ నియామకాలపై కొరవడిన స్పష్టత