
రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్
నల్లగొండ టూటౌన్: కేసీఆర్ హయాంలో రైతులకు స్వర్ణయుగంలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెట్టిస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ముందు రాష్ట్రంలో దుర్భిక్షం ఉంటే కేసీఆర్ హయాంలో 2017 నాటికి ఉమ్మడి జిల్లాలో రైతులు 40 లక్షల టన్నుల ధాన్యం అందించారన్నారు. సాగర్ ఆయకట్టులో ఇప్పటికే వరికోతలు 60 శాతం పూర్తయ్యాయని, అయినా ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో అన్నదాతలు మిల్లుల్లో అడ్డగోలు ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ, సివిల్ సప్లయ్ శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహించిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికై న మంత్రులు అధికారులతో సమీక్షించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నల్లగొండ మంత్రి ఏనాడు రైతుల గురించి పట్టించుకున్నది లేదన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడంలేదన్నారు. ఓ మంత్రి మైకంలో ఉంటూ రైతులను లెక్కేచేయడంలేదని, గాలి మోటార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత వానాకాలంలో రైతుల నుంచి సన్నధాన్యం ఎంత కొన్నారో, ఎంత బోనస్ ఇచ్చారో చెప్పే దమ్ము సీఎం, మంత్రులకు లేదన్నారు. జిల్లా కలెక్టర్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడవద్దని హితవు పలికారు. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, నిరంజన్‌వలీ, తండు సైదులు, కొండూరు సత్యనారాయణ, రావుల శ్రీనివాస్‌రెడ్డి, జమాల్‌ఖాద్రీ పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి