ధాన్యం రైతు దిగాలు! | - | Sakshi
Sakshi News home page

ధాన్యం రైతు దిగాలు!

Published Mon, Apr 7 2025 10:22 AM | Last Updated on Mon, Apr 7 2025 10:22 AM

ధాన్య

ధాన్యం రైతు దిగాలు!

ప్రభుత్వ కేంద్రాల్లో నత్తనడకన కొనుగోళ్లు

ఈ ఫొటోలోని రైతు శాలిగౌరారం మండలం భైరవునిబండ గ్రామానికి చెఇందిన యాదగిరిరెడ్డి. ఈ రైతు సాగు చేసిన వరి పంటను మార్చి 4న కోత కోసి గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించాడు. ధాన్యం మొత్తాన్ని ఆరబోసి రాశి చేశాడు. కానీ ఈ గ్రామంలోని కేంద్రం ఇప్పటి వరకు ప్రారంభించలేదు. అసలు మిల్లు ట్యాగింగ్‌, రవాణా సౌకర్యాల కల్పనపై ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. కేంద్రానికి ఈ రైతు ధాన్యం తెచ్చి నెలరోజులవుతున్నా.. ఇప్పటి వరకు కాంటా వేయకపోవడంతో రోజు రాశి వద్దే పడిగాపులు కాస్తున్నాడు. ప్రస్తుతం అకాల వర్షాల సీజన్‌ కావడంతో వర్షం పడితే ధాన్యం తడిసి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నాడు. ఇదీ జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి.

నల్లగొండ : యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. కొన్ని చోట్ల కేంద్రాలు ప్రారంభమే కాలేదు. ఇక.. కేంద్రాలు ప్రారంభించిన చోట ధాన్యం కాంటా వేసేందుకు నిర్వాహకులు అనేక కొర్రీలు పెడుతున్నారు. జిల్లాలోని కేంద్రాలకు ఇప్పటి వరకు 76,716 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాగా.. కేవలం 2,269 మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిర్ధేశిత తేమ శాతం రావడంలేదని నిర్వాహకులు చెబుతుండగా.. కొన్ని కేంద్రాల్లో హమాలీలు, బస్తాలు లేవన్న కారణంతో కొనుగోలు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కేంద్రాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. ఇక సన్నధాన్యం పండించిన రైతులు ఎక్కడా కేంద్రాల వద్దకు రావడం లేదు. నేరుగా మిల్లర్లకు ధాన్యం విక్రయించుకుంటున్నారు.

180 కేంద్రాలు ప్రారంభం

జిల్లాలో యాసంగి సాగు ముందస్తుగా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో ఏడున్నర లక్షల పైచిలుకు ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం కొనుగోలుకు 375 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మార్చి 24వ తేదీన రాష్ట్రంలోనే మొదట నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 180 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఆయా కేంద్రాలకు 76,716 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చింది. కేంద్రాలకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతోంది. 2,269 మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేసినా దానికి సంబంధించి ట్యాబ్‌ ఎంట్రీ, మిల్లులకు ట్రాన్స్‌పోర్టు కూడా వేగంగా సాగడం లేదు. ధాన్యం తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఇంకా మిల్లుల కేటాయింపు కూడా చేపట్టలేదని తెలుస్తోంది.

మిల్లుల బాట పడుతున్న రైతులు..

ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలంటే రోజుల తరబడి అక్కడ కాపాలా ఉండాల్సి వస్తోంది. అక్కడ అన్ని సౌకర్యాలు లేకపోగా.. నిర్వాహకులు రకరకాల కారణాలతో ధాన్యం కాంటా వేయడం లేదు. వాతావరణంలో మార్పులతో అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉండడంతో సన్న ధాన్యంతోపాటు దొడ్డు ధాన్యం పండించిన రైతులు కూడా మిల్లుల వైపు వెళ్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న మిల్లర్లు ధాన్యం ధర భారీగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.

ఫ కొన్నిచోట్ల అసలు ప్రారంభంకాని కేంద్రాలు..

ఫ ప్రారంభించిన చోట కొనుగోళ్లకు కొర్రీలు

ఫ కేంద్రాలకు వచ్చిన ధాన్యం 76,716 మెట్రిక్‌ టన్నులు

ఫ కొనుగోలు చేసింది 2,269 మెట్రిక్‌ టన్నులే..

ఫ మిల్లులకే వెళ్తున్న సన్న ధాన్యం పండించిన రైతులు

ధాన్యం రైతు దిగాలు!1
1/1

ధాన్యం రైతు దిగాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement