
కమనీయం.. రథోత్సవం
ఆస్పరి: కై రుప్పల గ్రామంలో గురువారం అశేష జనవాహని మధ్య వీరభద్రస్వామి రథోత్సవం కనుల పండవగా జరిగింది. వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా ఆలయంలో వీరభద్రస్వామి, కాళికాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఉత్సవ విగ్రహలను మేళతాళాలతో ఊరేగించారు. రథం ముందు పురోహితుడు మల్లికార్జున స్వామి పూజలు నిర్వహించి రథంపై ఉత్సవ విగ్రహలను చేర్చారు. అనంతరం జయ జయ ధ్వానాల మధ్య స్వామి వారి రథోత్సవం ప్రారంభమైంది. బసవన్న దేవాలయం వరకు, తిరిగి రథశాల వద్దకు లాగారు. రథోత్సవాన్ని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కదిలి వచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ తిమ్మక్క, ఆలూరు ఎమ్మెల్యే తనయుడు చంద్రశేఖర్, వెంగళాయిదొడ్డి ఆయకట్టు చైర్మన్ బసవరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.