
ఆరోగ్య యోజన సర్వే వంద శాతం పూర్తి చేయాలి
కోవెలకుంట్ల: ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని 60 సంవత్సరాలు దాటిన ఆర్హులైన పేదలకు వర్తింప చేసేందుకు చేపట్టిన సర్వేను వందశాతం పూర్తి చేయాలని జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు సూచించారు. శుక్రవారం స్థానిక మేజర్ గ్రామ పంచాయతీలోని 4, 5వ గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమ రికార్డులను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు నిర్వహించే ఆరోగ్య పరీక్షలపై ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలను అడిగి తెలుసుకున్నారు. ప్రైడే డ్రైడేలో భాగంగా నీటి తొట్లను పరిశీలించి దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు వ్యాప్తి చెందటంతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, తదితర విష జ్వరాలు ప్రబలే ఆస్కారం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఆయన వెంట మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ విశ్వనాథ్, ఎంపీహెచ్‌ఎస్, ఎంపీహెచ్‌ఏ మైమాన్ తదితరులు ఉన్నారు.
జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు