ధాన్యం ఇంటికి చేరేనా? | - | Sakshi
Sakshi News home page

ధాన్యం ఇంటికి చేరేనా?

Published Mon, Apr 7 2025 10:16 AM | Last Updated on Mon, Apr 7 2025 10:16 AM

ధాన్య

ధాన్యం ఇంటికి చేరేనా?

అకాల వర్షాలతో వరి రైతు కుదేలు

దిగుబడిపై తీవ్ర ప్రభావం

పంట నూర్పిడికి అదనపు భారం

కోవెలకుంట్ల: ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టాలు మూటగట్టుకున్న వరి రైతులకు రబీ సీజన్‌ కూడా కలిసి రావడం లేదు. నాట్లు వేసినప్పటి నుంచి ఒకవైపు సాగునీటి కష్టాలు, పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు వెంటాడుతుండటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో ని 29 మండలాల్లో ఈ ఏడాది రబీలో 28 వేల హెక్టార్లలో వరి సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌, కుందూనది, పాలేరు, కుందరవాగు పరివాహక ప్రాంతాల్లో 25 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇందుల్లో స్థానిక సబ్‌ డివిజన్‌లోని కోవెలకుంట్ల మండలంలో 725 హెక్టార్లు, సంజామల మండలంలో 203 హెక్టార్లు, అవుకు మండలంలో 1,552 హెక్టార్లు, కొలిమిగుండ్ల మండలంలో 17 హెక్టార్లు, ఉయ్యాలవాడ మండలంలో 761 హెక్టార్లు, దొర్నిపాడు మండలంలో 296 హెక్టార్లలో సాగైంది. ప్రస్తుతం పైరు రెండున్నర నెలలకు చేరుకుని పొట్ట దశలో ఉంది. మరో నెల రోజుల్లో పంట దిగుబడులు చేతికందనున్నాయి. ఇటీవల కాలంలో పది రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా రెండు పర్యాయాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పంట చేతికందే తరుణంలో అకాల వర్షాలు కురవడంతో పొట్ట దశలో ఉన్న పైరు నేలవాలి వడ్లు రాలిపోయా యి. కొని ప్రాంతాల్లో వరి పూర్తిస్థాయిలో పంటంతా నీట మునిగింది. మరో నెలరోజుల్లో దిగుబడులు చేతికందుతాయనుకుంటే వరణుడు కోలుకోలేని దెబ్బతీయడంతో రైతులు కుదేలవుతున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయనుకుంటే అకాల వర్షం నిలువునా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖరీఫ్‌లోనూ నష్టాల దిగుబడి

ఈ ఏడాది జిల్లా రైతాంగానికి ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు కలిసిరాలేదు. జిల్లాలోని దాదాపు 66 వేల హెక్టార్లలో సాగు చేశారు. రసాయన ఎరువులు, వరినారు, క్రిమి సంహారక మందులు, కలుపు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలు వెచ్చించారు. కౌలు రైతులు ఎకరాకు ఖరీఫ్‌లో 10 బస్తాలు, రబీలో మూడు బస్తాల వడ్లు చెల్లించేలా వరిమడులను కౌలుకు తీసుకున్నా రు. పైరు వివిధ దశల్లో అధిక వర్షాలు కురవడంతో వరిని దోమపోటు, అగ్గి తెగులు ఆశించడంతో తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు పడరానిపాట్లు పడ్డారు. అక్టోబర్‌ నెలలో తుపాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎకరాకు 30 బస్తాలకు మించి దిగు బడులు రాలేదు. ఈ క్రమంలో గిట్టుబాటు ధర అంతంత మాత్రంగానే పలికింది. గతేడాది క్వింటా రూ. 2,200 ధర పలకగా ఈ ఏడాది బస్తా రూ. 1,490 అమ్ముకుని నష్టాలు మూటగట్టుకున్నారు.

నేలవాలిన వరితో అదనపు భారం

జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో ఇటీవల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షాల వల్ల వివిధ ప్రాంతాల్లో వరి నేలవాలి చేతి కందకుండా పోయింది. పైరు నేల వాలడంతో వడ్లు రాలిపోయి నష్టం చేకూరింది. ఎకరాకు రెండు బస్తాలకు పైగా వడ్లు వరిమడిలో రాలిపోయినట్లు తెలుస్తోంది. రాలిపోయిన వడ్లు చేతికందే పరిస్థితి లేకపోగా మిగిలిన దిగుబడులను దక్కించుకునేందుకు రైతులపై అదనపు భారం పడనుంది. కూలీల సాయంతో పడిపోయిన వరిని కట్టలు కట్టుకోవాల్సి ఉంది. నేలవాలిన వరిలో యంత్రం సాయంతో నూర్పిడి మరింత కష్టంగా ఉంటుంది. వరి కట్టలు కట్టుకోవడం, నూర్పిడి వంటి పనులతో ఎకరాకు అదనంగా రూ. 5 వేలు అదనపు భారం పడుతుందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు, రెక్కలకష్టం పైరుపై పెట్టి దిగుబడులు దక్కించుకునేందుకు రైతులు అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు.

అకాల వర్షాలు భయపెడుతున్నాయి

ఈ ఏడాది రబీ సీజన్‌లో సాగు చేసిన వరిపైరును వేసవికాలం అకాల వర్షాలు భయపెడుతున్నాయి. పది ఎకరాల సొంత పొలంతోపాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలకు పైగా వెచ్చించాను. మరో నెల రోజులపాటు వర్షాలు పడకుంటే దిగుబడులు చేతికందుతాయి. ఈ మధ్య కాలంలో మోస్తరు వర్షం పడినా దిగుబడులు చేతికందకుండా పోతాయి. – వేణుగోపాల్‌రెడ్డి, రైతు,

భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం

పెట్టుబడి నేలపాలు..

గడివేముల మండలం కరిమద్దెలలో నేలవాలిన వరి పైరును చూపిస్తున్న రైతు పేరు రామకృష్ణ. ఎకరాకు 8 బస్తాలు కౌలు చెల్లించేలా 40 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఈ ఏడాది రబీ సీజన్‌ లో వరి సాగు చేశాడు. నారు, రసాయన ఎరువు లు, క్రిమి సంహారక మందులు, కలుపు నివా రణ, తదతర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలు ఖర్చు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట మొత్తం నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లింది. దిగుబడి చేతికందే తరుణంలో అకాల వర్షం ఆ రైతు కొంపముంచింది.

ధాన్యం ఇంటికి చేరేనా?1
1/1

ధాన్యం ఇంటికి చేరేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement