
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడి హౌస్ అరెస్ట్
కల్లూరు: కూటమి నేతలు గ్రామాల్లోనూ రాజకీయ చిచ్చు రగులుస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి అండగా నిలుస్తున్న గ్రామాలపై పగబడుతున్నారు. టీడీపీ నేతల నిర్ణయానికి పోలీసులు కూడా వంత పాడుతుండటం విమర్శలకు తావిస్తోంది. తాజాగా కొంగనపాడులో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే రథోత్సవానికి వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాల్గొనకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేసి కనీసం దర్శనానికి కూడా వెళ్లకుండా చేశారు. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంలో సీతారాముల రథోత్సవం నిర్వహిస్తారు. సోమవారం సాయంత్రం నిర్వహించనున్న ఈ రథోత్సవానికి కాటసాని రాంభూపాల్‌రెడ్డి హాజరయ్యేందుకు సిద్ధమవ్వగా కర్నూలు పోలీసులు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కల్లూరులోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కాటసాని మీడియాతో మాట్లాడారు. తాను 2009 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా.. లేకున్నా ప్రతి ఏడాది జరిగే సీతారాముల రథోత్సవానికి హాజరవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. 2014–2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ రథోత్సవంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. పొరపాటున కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. 2024 ఎన్నికల్లో కూడా గ్రామంలో మెజార్టీ వచ్చిందని, దీన్ని జీర్ణించుకోలేకనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, పోలీసులు గ్రామంలో ఉన్నది ప్రభుత్వ దేవాలయం కాదని తెలుసుకోవాలన్నారు. పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తనను అడ్డుకుంటున్నారన్నారు. రథానికి డబ్బులు ఇచ్చింది కూడా ఎక్కువ శాతం తన అనుచరులేనన్నారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి దుశ్చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదని, అందరికీ దర్శనాలకు అవకాశం కల్పించామన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఆయన వెంట నాయకులు కాటసాని శివనరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుక, పలువురు కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
రథోత్సవంలో పాల్గొనకుండా
పోలీసుల నోటీసులు