
దశాబ్దాలుగా ఉన్న శ్రీశైల దేవస్థానం సంబంధించిన భూ సమస్య
● శ్రీశైల క్షేత్రాభివృద్ధికి అడ్డంకిగా
మారిన భూ సమస్య
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
దేవస్థానం భూమిని గుర్తించిన వైనం
● సరిహద్దులను గుర్తించాలని
సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ
● కూటమి ప్రభుత్వంలో సమావేశాలతో
సరిపెడుతున్న పాలకులు
● రేపు డిప్యూటీ సీఎం పవన్ అధ్యక్షతన
మళ్లీ సమావేశం
● ప్రభుత్వ గెజిట్ కోసం వేచిచూస్తున్న
శ్రీశైల దేవస్థానం
శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపునకు గురైనది
900 ఎకరాలు
దేవస్థానానికి కేటాయించిన భూమి
5,302 ఎకరాలు
అభయారణ్యంతోనే అడ్డంకులు
శ్రీశైలంలో ప్రధాన ఆలయాలు విస్తరించిన ప్రదేశం ఎంత ఉంది, మల్లమ్మ కన్నీరు ప్రాంతం నుంచి ఎంత వరకు దేవస్థానానికి చెందిన భూమి ఉంది, ఈ రెండు కలిసే ఉన్నాయా.. లేక విడివిడిగా ఉన్నాయా అనే విషయాలపై చర్చించాల్సి ఉందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా శ్రీశైలం ఎన్‌క్లోజ్‌డ్ ఏరియాలో ఉందని, శ్రీశైలం అటవీప్రాంతం అభయారణ్యంగా ప్రకటించిన నేపథ్యంలో ఎన్‌టీసీఏ నిబంధనలు పాటించాలి. అలాగే ఎకో సెన్సిటీవ్ జోన్ ఉన్న క్రమంలో ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై అటవీశాఖ ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవస్థానం, అటవీశాఖ, ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్ చేపట్టిన సర్వే ప్రకారం గుర్తించిన భూములను దేవస్థానానికి అప్పగించేందుకు ప్రభుత్వం నుంచి దేవదాయశాఖకు గెజిట్ రావాల్సి ఉంది.
శ్రీశైలంటెంపుల్: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలసి వెలసిన శ్రీశైల మహాక్షేత్రానికి ఏటేటా భక్తుల తాకిడి పెరుగుతోంది. శ్రీశైల క్షేత్రపరిధిలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా.. భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నా.. అటవీశాఖ నుంచి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు శ్రీశైల దేవస్థానానికి ఎంత స్థలం ఉంది అని విషయంలో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు శ్రీశైల క్షేత్రానికి సంబంధించి ఎంత స్థలం ఉంది అనే విషయాన్ని గుర్తించేందుకు దేవస్థాన అధికారులు పలుమార్లు అటవీశాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దేవస్థానం భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి, క్షేత్ర సరిహద్దులను గుర్తించేందుకు అప్పటి పాలకులు చొరవ చూపారు. అప్పటి శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవస్థాన చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దేవదాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్షేత్రపరిధి సరిహద్దులను కచ్చితంగా గుర్తించేందుకు దేవదాయశాఖ, అటవీశాఖ, రెవెన్యూ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మూడు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి రికార్డుల ఆధారంగా ప్రాథమికంగా శ్రీశైల దేవస్థానానికి 5,302 ఎకరాల భూమి ఉందని నిర్ధారించారు. మూడు శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టాలని నిర్ణయించారు. శ్రీశైలంలో క్షేత్ర సరిహద్దులను గుర్తించేందుకు దేవదాయ, అటవీ, ల్యాండ్ అండ్ సర్వే శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టారు. సర్వే చేసి కచ్చితమైన సరిహద్దులను గుర్తించారు. శ్రీశైల దేవస్థానానికి 1967 నవంబర్ 30న జీఓ ఎంఎస్ నెం 2191 ఫుడ్ అండ్ అగ్రికల్చరేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం 5,302 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మొత్తం భూమి 9 సర్వే నెంబర్లలో ఉంది. ఆ భూమిలో 900 ఎకరాలు శ్రీశైలంప్రాజెక్టు రిజర్వాయర్‌లో ముంపు అయింది. బ్రిటీష్‌కాలం నాటి జీవో, ఆనాటి గెజిట్ ఎంట్రీ ద్వారా సర్వే చేయించి క్షేత్ర సరిహద్దులను గుర్తించారు. 4,400 ఎకరాలు శ్రీశైల మల్లన్నకు చెందిన భూమిగా అటవీశాఖ అంగీకరించింది. దీంతో ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు ఆ శాఖ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్‌కు
డీఎఫ్‌వో లేఖ
శ్రీశైల దేవస్థానానికి చెందిన భూములు గుర్తించడంతో అటవీ శాఖ ఇచ్చేందుకు ఒప్పందం కూడా జరిగింది. 2023 ఫిబ్రవరి 22న సున్నిపెంటలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు కేంద్ర కార్యాలయంలో అప్పటి దేవస్థాన ఈఓ ఎస్.లవన్న, ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ అధికారి అలెన్ చాంగ్ టెరాన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆ కాపీని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌కు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవదాయశాఖకు భూమిని అప్పగించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే డిపార్ట్‌మెంట్‌కు డీఎఫ్‌వో లేఖ రాశారు.
అనుమతులు లభించేనా..
శ్రీశైలంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి, శ్రీశైల క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అధ్యక్షతన గత సంవత్సరం నవంబరు 25న మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధిపై దేవదాయ, టూరిజం, అర్‌అండ్‌బీ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా శ్రీశైల దేవస్థానానికి భూముల కేటాయింపుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వాలని జిల్లా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆ నివేదికలను ప్రభుత్వానికి చేరవేశారు. ఆ నివేదికల మేరకు బుధవారం వైజాగ్‌లో జరిగే సమావేశంలో శ్రీశైల దేవస్థానికి భూముల కేటాయింపుపై స్పష్టత రానుంది. సమావేశాలతోనే సరిపెట్టకుండా మల్లన్న క్షేత్ర భూ సమస్యపై ప్రత్యేక చొరవ చూపి శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

దశాబ్దాలుగా ఉన్న శ్రీశైల దేవస్థానం సంబంధించిన భూ సమస్య

దశాబ్దాలుగా ఉన్న శ్రీశైల దేవస్థానం సంబంధించిన భూ సమస్య

దశాబ్దాలుగా ఉన్న శ్రీశైల దేవస్థానం సంబంధించిన భూ సమస్య