
పార్వేట గుర్రంపై రంగనాథుని విహారం
జూపాడుబంగ్లా: బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం శ్రీలక్ష్మీరంగనాథునిస్వామి వారు పార్వేట గుర్రంపై విహరించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అధిష్టింపజేశారు. పార్వేట గుర్రాన్ని తీసుకొని పాతరంగస్వామి దేవాలయం సమీపంలో పార్వేట గొర్రెను వదిలిపెట్టారు. అనంతరం పాతరంగనాథస్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పార్వేట గుర్రంతో పాటు స్వామివారిని తీసుకొని పద్యాలను పాడుకుంటూ దేవాలయానికి చేరారు.
నేటి నుంచి చేపలవేట నిషేధం
శ్రీశైలం ప్రాజెక్ట్: మత్స్యసంపద అభివృద్ధి కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు రాష్ట్రం వ్యాప్తంగా చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. చేపల పునరుత్పత్తి ఈ రెండు నెలల్లో అధికంగా ఉంటుంది. మత్స్యకారులు వేట కొనసాగిస్తే పెద్ద చేపలతో పాటు చిన్న చేపలు కూడా అంతరించే ప్రమాదం ఉంది. కృష్ణా నదీ తీరం వెంట, శ్రీశైలండ్యాం ఎగువ, దిగువ ప్రాంతాల్లో చేపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.