లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లి జిల్లా కైరానాకు చెందిన అజీమ్ మన్సూరి పుట్టుకతోనే మరుగుజ్జు. ప్రస్తుతం అతడి వయసు 26 ఏళ్లు. రెండున్నర అడుగుల ఎత్తు(పొడవు)మాత్రమే ఉండే మన్సూరి వస్త్రాల వ్యాపారం చేస్తూ పెళ్లికోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. చాలా సంబంధాలు వచ్చినప్పటికి వాటిల్లో ఒక్కటి కూడా కుదరలేదు. దీనికి కారణం అతడి హైటే. బాగా విసిగిపోయిన అజీమ్ షామ్లి పోలీసులను కలిసి తనకు పెళ్లి కూతుర్ని వెదికి పెట్టండి అని విన్నవించాడు. ఇది మా పని కాదయ్య అని పోలీసులు సర్దిచెప్పి పంపించారు. అయితే ఈ విషయం అటూ ఇటూ తిరుగుతూ సోషల్ మీడియాలో గుప్పుమనడంతో అజీమ్ వైరల్‌గా మారాడు. వైరల్ వీడియో వరంలా మారడంతో.. అతన్ని సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
అజీమ్ ఐదోతరగతివరకే చదువుకున్నప్పటికి బట్టల వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. సొంత ఇల్లు కూడా ఉండడంతో.. అజీమ్‌కు 21 ఏళ్లు వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. అలా చూస్తూ చూస్తూనే ఐదేళ్లు గడిచిపోయాయి. మరగుజ్జు కావడంతో అమ్మాయిలు అతనిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడేవారు కాదు. దీంతో అతడు పెళ్లి చేయాలంటూ ఏకంగా అప్పటి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు 2019లో ఓ లేఖ కూడా రాశాడు.
ఫలితం లేకపోవడంతో.. ఆ తర్వాత కొన్ని రోజులకి తనకు పెళ్లి కూతురిని వెతికిపెట్టి, పెళ్లి చేయండంటూ పోలీసులను ఆశ్రయించాడు. ‘‘పబ్లిక్ సర్వీసెస్‌లో భాగంగా తనకు ఈ ఒక్కసాయం చేసి పుణ్యం కట్టుకోండి సార్’’ అంటూ అజీమ్ పోలీసులను వేడుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అజీమ్ ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. దీంతో పెళ్లి సంబంధాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అజీమ్ వైరల్ వీడియోచూసిన హాపూర్‌కు చెందిన హాజీ ఆయుబ్, షాహిద్ మన్సూరిలు అజీమ్ కుటుంబ సభ్యులను కలిసి బుష్రా అనే అమ్మాయి గురించి చెప్పారు.
ఎండమావిలో నీటిచుక్కకోసం ఎదురుచూసినట్లు తన జీవిత భాగస్వామి కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తోన్న అజీమ్ బి.కాం మొదటి సంవత్సరం చదువుతోన్న బుష్రా నచ్చడంతో మార్చి 31న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. బుష్రా ఎత్తు మూడు అడుగులు. ‘‘ప్రస్తుతం నిశ్చితార్థం అయింది, తన బి.కాం పూర్తయిన తరువాత పెళ్లి చేసుకుంటాము’’ అని ఎంతో ఆనందంతో చెప్పాడు అజీమ్.
‘‘పెళ్లిచూపులు జరిగిన ప్రతిసారి నేను తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడిని. చిన్నప్పటి నుంచి నాతోటివారు, స్నేహితులు చేసే కామెంట్స్ భరించలేక ఐదోతరగతితోనే చదువు ఆపేశాను. ఆతర్వాత నెమ్మదిగా ఒక్కో పనిచేసుకుంటూ.. ఇప్పుడు ఈబట్టల వ్యాపారంలో నిలదొక్కుకున్నాను. ఐదేళ్లుగా ఎంత ప్రయత్నించినా పెళ్లికాకపోవడంతో రాత్రులు నిద్రకూడా పట్టేదికాదు. నాతో జీవితాన్ని పంచుకునే అమ్మాయే లేదా అనిపించేది. కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. పెళ్లికావడంలేదని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్లే ఈరోజు నాకు బుష్రా దొరికింది’’ అని అజీమ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘మరో ఏడాదిలో మా చెల్లి డిగ్రీ పూర్తవుతుంది. ఆ తరువాత తనకి అజీమ్‌తో పెళ్లి జరుగుతుందనే మాట మాకు సంతోషాన్నిస్తుంది’’ అని బుష్రా అక్క జోయా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment