బెంగళూరు: పెంపుడు కుక్క పిల్లతో కలిసి కుటుంబసమేతంగా ఉత్తర భారతదేశ యాత్ర చేద్దామనుకున్న కుటుంబానికి విమాన పైలట్ షాకిచ్చాడు. నా విమానంలో కుక్క పిల్లను ఎక్కనిచ్చేది లేదని అతడు భీష్మించడంతో ఆ కుటుంబం బాధపడి టూర్‌నే రద్దు చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సచిన్ శెణై భార్య ఉమా, కుమారుడు ఆర్య, పెంపుడు కుక్కపిల్ల ప్లఫియాతో కలిసి 12 రోజుల పాటు ఢిల్లీ, పంజాబ్ విహార యాత్రకు ప్లాన్ చేశాడు. గత శనివారం కెంపేగౌడ విమానాశ్రయం నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఏ1 503 విమానంలో ఢిల్లీకి బయలుదేరాలి. కుక్కపిల్లతో ప్రయాణానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది అనుమతించారు. బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చారు. కానీ కుక్కపిల్ల ప్రయాణానికి సదరు విమాన పైలట్ చోప్రా నిరాకరించారు. కుక్క పిల్లను వదిలేసి టూర్‌కి వెళ్లాలని సహచర ప్రయాణికులు సలహా ఇచ్చారు. కొంతసేపు చర్చలు జరిగినప్పటికీ ఫలించలేదు.
బుజ్జి కుక్కకు అనుమతి ఇవ్వకపోవడంతో సచిన్ ఆవేదన చెంది టూర్‌నే రద్దు చేసుకున్నాడు. ఆయన ఎయిర్‌పోర్టులో జరిగిన తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. నిబంధనల ప్రకారం 5 కేజీల లోపు ఉన్న కుక్కను ప్రయాణికులు విమానంలో తీసుకెళ్లవచ్చు. ఈ వ్యవహారంపై ఇండియన్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ సచిన్ ఢిల్లీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశాం, కానీ కుక్కపిల్ల విషయంలో విమాన పైలట్లదే అంతిమ నిర్ణయం అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment