'మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అంశంపై నిర్ణయం తీసుకుంటాం' | Ajit Pawar Says Decision On Lockdown In 10 Days | Sakshi
Sakshi News home page

ప్రయాణికులపై ఆంక్షలు.. నెగెటివ్‌ వస్తేనే అనుమతి

Published Tue, Nov 24 2020 7:20 AM | Last Updated on Tue, Nov 24 2020 1:02 PM

Ajit Pawar Says Decision On Lockdown In 10 Days - Sakshi

సాక్షి, ముంబై: ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్, గోవా రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికులకు నెగెటివ్‌ వస్తేనే అనుమతిస్తామని మహా ఆఘాడీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ పాజిటివ్‌ వస్తే క్యారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని, కోలుకున్నాక మాత్రమే రాష్ట్రంలోకి ప్రవేశం కల్పిస్తామని స్పష్టంచేసింది. నెగెటివ్‌గా ధ్రువీకరించాలంటే కోవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షల రిపోర్టులను చూపించాలని సూచించింది. ఇక కోవిడ్‌ కేసులు పెరిగిపోతుండటంతో రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. కనీసం రెండు వారాలు కరోనా కేసులను పరిశీలిస్తామని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ టోపే కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లాక్‌డౌన్‌ కాకపోయినా సడలించిన ఆంక్షలను మళ్లీ విధించాల్సిన పరిస్థితి రావొచ్చని తెలిపారు.  

మహారాష్ట్రతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా మళ్లీ పడగ విప్పింది. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి వచ్చే పలు రాష్ట్రాల ప్రయాణికులపై మళ్లీ కొన్ని ఆంక్షలు విధించింది. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్‌ కరోనా పరీక్షలు చేయించుకోవడం అనివార్యం చేసింది. దీంతో ఇకపై ఈ నాలుగు రాష్ట్రాల నుంచి విమానం, లేదా రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల రిపోర్టును చూపించాల్సి ఉండనుంది. నెగిటివ్‌ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతించనున్నారు. అదేవిధంగా 72 గంటల కింద చేయించుకున్న పరీక్షలకు మాత్రమే అనుమతి ఉండనుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను (ఎస్‌ఓపీ)ని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులు 96 గంటలలోపు రిపోర్టను చూపించాలి.   (ప్రపంచానికి శనిలా పట్టుకుంది!)

4,153 కొత్త కేసులు 
రాష్ట్రంలో కొత్తగా 4,153 కోవిడ్‌ కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం బులెటిన్‌లో వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 17,84,361 కు చేరుకుంది. అలాగే, సోమవారం ఒక్కరోజే  3,729  మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 16,54,793 కి పెరిగింది. కొత్తగా 30 కోవిడ్‌ మరణాలు సంభవించగా.. రాష్ట్రంలో కోవిడ్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 46,653 కు చేరుకుంది. రాష్ట్రంలో రికవరీ రేటు 92.74 శాతం కాగా, మరణాల రేటు 2.61 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. నాగ్‌పూర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 256 మంది బాధితులకు సోకింది. ప్రస్తుతం, 5,17,711 మంది గృహ నిర్బంధంలో, 6,524 మంది ఇతర చోట్ల చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 81,902 క్రియాశీల కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,02,81,543 కోవిడ్‌ టెస్టులు నిర్వహించారు. సోమవారం ఒక్క ముంబైలోనే కొత్తగా 800 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. మొత్తం 4,153 కొత్త కేసులలో ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో 1,551 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇక్కడ ఇప్పటివరకు అక్కడ కోవిడ్‌ బారినపడిన వారి సంఖ్య 2,76,514 అయింది. ముంబైలో 14 మంది కరోనాతో చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 10,689 గా నమోదైంది. ముంబై నగరం, దాని ఉప నగరాల్లో ఇప్పటివరకు 6,19,025 కేసులు, 18,519 మరణాలు నమోదయ్యాయి. నాసిక్, పుణే మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో వరుసగా 24 , 214 కరోనా కేసులు నమోదయ్యాయి.   (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!)

ముంబైలో గత మూడు రోజుల్లో (నవంబర్‌ 20, 22 మధ్య) 1,000 కంటే ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. నవంబర్‌ 16 న 409 కరోనా కేసులు వెలుగు చూసిన అనంతరం కొన్ని రోజుల వరకు కేసులు పెరుగుతూ వచ్చాయి. నవంబర్‌ 20, 21, 22 తేదీల్లో ముంబైలో వరుసగా 1,031, 1,092, 1,135 కొత్త కేసులు వచ్చాయి. దీంతో అధికారుల్లో మళ్లీ అలజడి మొదలైంది. బీఎంసీ ఫిబ్రవరి 3 నుంచి నగరంలో 17.85 లక్షల కోవిడ్‌ పరీక్షలను నిర్వహించింది. కాగా, కోవిడ్‌ –19తో కోలుకున్న వారి సంఖ్య 2, 52,499 కు పెరిగిందని, గత 24 గంటల్లో 372 మంది రోగులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని బీఎంసీ తెలిపింది. అయితే గణాంకాల ప్రకారం కోవిడ్‌తో కోలుకున్న రోగుల శాతం 92 నుంచి 91శాతానికి పడిపోయింది. కాగా, కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండటంతో నగరంలో 390 కంటైన్మెంట్‌ జోన్లు, 4,280 భవనాలకు సీలు వేశామని అధికారులు తెలిపారు.   (యూరప్‌లో థర్డ్‌ వేవ్‌!)

చైత్య భూమికి రావొద్దు 
అంబేడ్కర్‌ 64వ మహా పరినిర్వాణ్‌ దిన్‌ సందర్భంగా డిసెంబర్‌ 6న ముంబైలో చైత్యభూమిలో ఉన్న బాబాసాహెబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారక చిహ్నం వద్దకు అభిమానులు రావొద్దని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరిగిపోతున్నందున అందరూ వారి వారి ఇళ్ల నుంచే అంబేడ్కర్‌కు నివాళి అర్పించాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాతకు ఎక్కడ ఉన్నా గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. అంబేడ్కర్‌ మహా పరినిర్వాణ్‌ దిన్‌ (వార్షికోత్సవం) దృష్ట్యా నిర్వహించిన సమీక్షలో సీఎం పాల్గొన్నారు. డిసెంబర్‌ 6న ముంబైకి రాకూడదని మహాపరినిర్వాణ్‌ దిన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీలు అంబేడ్కర్‌ అనుచరులకు చేసిన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి స్వాగతించారు. సమీక్షలో హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్, సామాజిక న్యాయశాఖ మంత్రి ధనంజయ్‌ ముండే, ముంబై ఇన్‌చార్జీ మంత్రి అస్లాం షేక్, ఉన్నతాధికారులు హాజరయ్యారు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement