ఆదివారం ఆగ్రాలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేశ్‌తో రాహుల్ సెల్ఫీ
ఆగ్రా: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారథ్యంలో యూపీలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో సీట్ల పంపిణీపై రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆగ్రాలో రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ వారు ముందుకు సాగారు.
భారీగా హాజరైన ఇరుపార్టీల కార్యకర్తలు వారికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ..రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం రైతుల శక్తిని చూసి భయపడే పరిస్థితికి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం గద్దెదిగి, ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.
తమ ప్రభుత్వం రైతులకు తగు గౌరవం ఇస్తుందని చెప్పారు. వెనుకబడిన కులాలు, దళితులు, మైనారిటీలకు బీజేపీ తగు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రి యాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొ న్నారు. అంతకుముందు నేతలు ఆగ్రాలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జోడో యాత్రలో అఖిలేశ్ పాల్గొనడంపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment