న్యూఢిల్లీ: ఉగ్రవాదం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దేశంలో మళ్లీ కొత్తగా ఉగ్ర గ్రూపు ఏర్పడకుండా కఠినమైన వైఖరిని అవలంబించాలని ఉగ్రవాద వ్యతిరేక విభాగాలను కోరారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు, ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించివేయాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతోపాటు అన్ని విభాగాలు ఉమ్మడిగా ముందుకు సాగాలన్నారు.
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో రెండు రోజుల జాతీయ ఉగ్ర వ్యతిరేక సదస్సునును అమిత్ షా ప్రారంభించి, ప్రసంగించారు. క్రిప్టో కరెన్సీలు, హవాలా, ఉగ్ర నిధులు, వ్యవస్థీకృత నేర ముఠాలు, డ్రగ్స్– ఉగ్ర లింకులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు తొమ్మిదేళ్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు మంచి ఫలితాలు సాధించాయని ఆయన అన్నారు. ఎన్‌ఐఏ, ఉగ్ర వ్యతిరేక బృందాలు, రాష్ట్రాల టాస్క్‌ఫోర్స్‌లు కేవలం కేసుల దర్యాప్తునకే పరిమితం కారాదన్నారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తమ పరిధిని దాటి వినూత్నవిధానాలను ఆలోచించాలని కోరారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేసే క్రమంలో అంతర్జాతీయ సహకారంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల సహకారం కూడా అవసరమని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రాలు, వివిధ ఏజెన్సీల మధ్య సహకారం ఉండాలన్నారు. ఇందుకోసం కేంద్రం పలు డేటా బేస్‌లను అందుబాటులోకి తెచ్చిందన్నారు.
ఎన్‌ఐఏ పరిధిలో మోడల్ యాంటీ టెర్రరిజం నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి, కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య మెరుగైన సమన్వయం కోసం అన్ని రాష్ట్రాల్లోని ఉగ్రవాద వ్యతిరేక విభాగాల అధికార క్రమం, నిర్మాణం, విచారణ, కార్యాచరణ విధానం ఏకరీతిగా ఉండాలన్నారు. 94 శాతం కంటే ఎక్కువగా నేరారోపణ సాధించిన ఎన్‌ఐఏ కృషిని షా ప్రశంసించారు. ఈ ఏడాదిలో ఎన్‌సీబీ చేపట్టిన ఆపరేషన్ సముద్రగుప్తతో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగలిగామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment