సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయ సమరంలో ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కలు చూపించేందుకు రాజకీయపార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఏళ్ళ తరబడి పార్టీనే నమ్ముకొని పనిచేసిన నాయకులకు ధీటుగా ప్రజలను ఆకట్టుకొనేందుకు సినీ తారలు, దర్శకులను రాజకీయ పార్టీలు బరిలో దింపాయి. దీంతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు బెంగాలీ చిత్ర పరిశ్రమ ఒక ఆయుధంగా మారింది. బెంగాలీ చిత్ర పరిశ్రమపై తృణమూల్ కాంగ్రెస్ దశాబ్దంన్నరగా ప్రభావం చూపుతోంది. గతంలో మమతా బెనర్జీ చేపట్టిన సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాలకు సినీ రంగం మద్దతు పలికింది. 34 ఏళ్ళ వామపక్ష పాలనకు వ్యతిరేకంగా సాగిన కార్యక్రమాల్లోనూ బెంగాలీ సినీ పరిశ్రమలోని కొందరు కీలక పాత్ర పోషించారు.
మమత బెనర్జీ కూడా ప్రతి ఎన్నికల్లోనూ సినీ పరిశ్రమలోని వారికి రాజకీయంగా అవకాశాలు ఇస్తూ, విజయాన్ని సాధిస్తూ వచ్చారు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలతో బెంగాల్‌లో రాజ కీయ పరిస్థితి మారడం ప్రారంభమైంది. అప్పటివరకు తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన సినీరంగ ప్రముఖులు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపించడంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలం బాగానే వికసించింది. ఇప్పడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగాలీ సినీ ప్రముఖులు కమలదళంవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
రెండు వర్గాలుగా..
ఇప్పుడు బెంగాలీ సినీలోకం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం అధికార తృణమూల్‌తో నిలబడగా, మరోవర్గం బీజేపీ పంచన చేరిపోయింది. బెంగాల్‌లో కమలదళం ఇంత మంది సినీ తారలను ఎందుకు బరిలో దింపడానికి మమతాబెనర్జీ బీజేపీపై చేస్తున్న ఘాటు విమర్శలే ప్రధాన కా>రణం. బీజేపీ బెంగాల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తోందని ఆమె భావించడం మొదలైన తర్వాత, ఎలాగైనా అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. బీజేపీ అంటే స్థానికేతర పార్టీ అనే భావనను మమతా బెనర్జీ ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు అవసరమైన ఏ ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు.
దీంతో తప్పనిసరిగా దీదీ ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొనేందుకు కమలదళం ఆమె ఫార్ములానే అనుసరించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే కమలదళం బెంగాలీ సినీలోకానికి చెందిన వారిపై ఆశలు పెట్టుకుంది. సినీ ప్రముఖులు పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో, దీదీ వ్యూహాలను చిత్తుచేయడంలో తమకు కలిసివస్తారని కమలదళం భావిస్తోంది. అదే సమయంలో సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న చాలా మంది ప్రముఖులను తృణమూల్ కాంగ్రెస్ కూడా బరిలోకి తీసుకువస్తోంది. సినీ ప్రముఖులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఓటుబ్యాంకును ప్రభావితం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: (‘బంగారు బంగ్లా’ చేస్తాం: అమిత్ షా)
(దెబ్బతిన్న పులి మరింత ప్రమాదకారి: దీదీ)
బీజేపీలోకి మిథున్
మొదట నక్సలైట్ ఉద్యమం, వామపక్షాలకు మద్దతుదారుగా ఉండి 2014లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టిన మిథున్ చక్రవర్తి ఇప్పుడు కమలాన్ని బెంగాల్‌లో వికసింపచేసే పనిలో ఉన్నారు. మిథున్ చక్రవర్తి కాషాయ కండువా కప్పుకొనే ముందే బెంగాలీ నటులు యష్ దాస్ గుప్తా, హిరేన్ ఛటర్జీ, రుద్రానిల్ ఘోష్, నటి పాయల్ సర్కార్, స్రవంతి ఛటర్జీ, పాపియా అధికారి కమలదళంలో చేరిపోయారు. కేవలం సినీ తారలే కాకుండా, పలువురు టీవీ నటులు సైతం టీఎంసీ, బీజేపీ కండువాలు కప్పుకున్నారు. బాబుల్ సుప్రియో, రూప గంగూలీ, లాకెట్ ఛటర్జీలు బీజేపీలో చాలా కాలంగా ఉండగా, రిమామ్ మిత్రా, అంజనా బసు, కాంచన మొయిత్రాలు 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం కమలదళంలో సభ్యులయ్యారు. అయితే, బాద్షా మొయిత్రా, అనిక్ దత్తా, సబ్యసాచి చక్రవర్తి, కమలేశ్వర్ ముఖర్జీ, తరుణ్ మజుందార్, శ్రీలేఖా మిత్రా తదితర సినీ ప్రముఖులు ఇప్పటికీ వామపక్షాలతోనే ఉన్నారు. బెంగాల్ రాజకీయాలను వీరంతా ఏ మేరకు ప్రభావితం చేస్తారో వేచి చూడాల్సిందే.
మమత వెనుక సినీలోకం
పశ్చిమ బెంగాల్‌లో మొదటి నుంచి వామపక్ష భావజాలం సినిమాలు, సాహిత్యం, సంస్కృతిపై ఆధిపత్యాన్ని చెలాయించింది. కానీ 2006లో వామపక్ష పాలనకు చరమగీతం పాడేందుకు, మార్పును కోరుతూ మమతాబెనర్జీ చేసిన ప్రయత్నాలకు సినీ లోకం ఆసరాగా నిలిచింది. అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ మమతా బెనర్జీ విజయంలో సినీ ప్రముఖులు కీలక పాత్ర పోషించారు. అయితే 2009, 2014 ఎన్నికల్లో బెంగాలీ సినీ నటుడు తపస్ పాల్‌ను కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి, నటి శతాబ్ది రాయ్‌ను 2009, 2014, 2019 ఎన్నికల్లో బీర్భూమ్ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నిలబెట్టిన మమతా బెనర్జీ ఇద్దరినీ గెలిపించుకోగలిగారు.
అనంతరం 2016 అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు చిరంజీత్, నటి దేవశ్రీ రాయ్‌లను నిలబెట్టి ఇద్దరిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నటుడు దేవ్ (దీపక్ అధికారి), నటి మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్, శతాబ్ది రాయ్, మున్‌మున్ సేన్, నాటక రచయిత అర్పితా ఘోష్‌లను రంగంలోకి దింపినప్పటికీ, కేవలం దేవ్, మిమి, నుస్రత్ జహాన్, శతాబ్ది రాయ్‌లు ఎంపీలుగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నటి లాకెట్ ఛటర్జీని హుగ్లీ నుంచి నిలబెట్టి, ఎంపీని చేసుకో గలిగింది. తాజాగా ఇప్పుడు జరుగబోతున్న ఎన్నికలకు సంబంధించి టీఎంసీ అభ్యర్థుల ప్రకటన ఇప్పటికే పూర్తయింది. అందులో బెంగాలీ సినీ పరిశ్రమలోని ఆరుగురు నటీమణులు, ముగ్గురు నటులు, ఒక దర్శకుడిని మమతా బెనర్జీ బరిలో నిలిపింది.
Comments
Please login to add a commentAdd a comment