
నువ్వు విదేశీయుడివి నీకు ఇక్కడేం పని.. బైక్ ట్యాక్సీ ఎందుకు నడుపుతున్నావంటూ..
బెంగళూరు: ప్రస్తుత కాలంలో బయటకు వెళ్లాలంటే కొంత మంది ట్యాక్సీలను వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో టాక్సీలు, బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక, ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో కొన్ని సిటీల్లో ఆటోలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో, వారు ట్యాక్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కర్నాటకలో ఓ ఆటో డ్రైవర్.. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌ను వేధింపులకు గురిచేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రోస్టేషన్ వద్ద ఓ ఆటో డ్రైవర్.. ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. అతడి ఫోన్ లాక్కుని ఆవేశంతో నేలపై కొట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆటో డ్రైవర్ మాట్లాడుతూ..‘మిత్రులారా, అక్రమ ర్యాపిడో వ్యాపారం ఎలా జరుగుతుందో చూడండి. వేరే దేశం నుండి మన దేశానికి వచ్చి రాజు ఇక్కడ బైక్ ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. ఇలాంటి వారి కారణంగా మాకు వ్యాపారం లేకుండా పోయింది. వేరే దేశానికి చెందిన అతడు వైట్ నంబర్ ప్లేట్ బోర్ట్(ఎల్లో కలర్ ట్యాక్సీ నంబర్ ప్లేట్ కాకుండా) ఉన్నప్పటికీ ఒక అమ్మాయిని తీసుకెళ్లడానికి వచ్చాడు’ అంటూ సీరియస్ అయ్యాడు.
కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బైకర్.. పోలీసుల ఫిర్యాదు చేయనప్పటికీ వీడియో ఆధారంగా పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు. సదరు ఆటోడ్రైవర్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.
@indiranagaraps is investigating the incident. Strict and necessary action will be taken. https://t.co/QosaVAF0gO
— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) March 7, 2023