ఉపాధి కోసం సాధారణ వ్యక్తిగా దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీకి అక్కడ జరిగిన ఓ అవమానం ఆయన ఓ అసాధారణ శక్తిగా అవతరించేందుకు దోహదపడింది. అది అందరికీ తెలిసిన ఘటనే. దక్షిణాఫ్రికాలోని తెల్లవాళ్లు గాంధీని రైలు నుంచి బయటకు గెంటివేయడం! 1893 జూన్ 7న జరిగిన ఆ ఘటన, గాంధీ ఆలోచన తీరుపై బలమైన ముద్రవేసింది. నాడు తాను ఎదుర్కొన్న అవమానం, అప్పుడు ఆయన పడిన వేదన, మనసులోని కల్లోలం ఆయన తన ఆత్మకథ ‘ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పరిమెంట్స్ విత్ ట్రూత్’ లో రాసుకున్నారు. గాంధీ లా చదువుకున్నారు. న్యాయవాదిగా పని చేసేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు.
అక్కడ తాను పని చేసే అబ్దుల్లా సేఠ్ కంపెనీ తరపున ఒక కేసు వాదించేందుకు డర్బన్ నుంచి ప్రిటోరియా వెళ్లాల్సి వచ్చింది. అది రైలు ప్రయాణం. డర్బన్ రైల్వే స్టేషన్‌లో గాంధీ మొదటి తరగతి రైలు టికెట్ తీసుకున్నారు. అయితే ఆ రైలు ప్రయాణం తన జీవితాన్ని మార్చి వేస్తుందని ఆనాటికి 24 ఏళ్ల వయసున్న గాంధీ ఊహించి ఉండరు. రాత్రి 9 గంటల ప్రాంతంలో నతాల్ రాజధాని మారిట్జ్‌బర్గ్‌కు రైలు చేరుకుంది. రైలు ఆగగానే బోగీలోకి ఒక తెల్లజాతీయుడు వచ్చాడు. గాంధీజీని చూడగానే దిగిపోయాడు. అందుకు కారణం గాంధీజీ నల్లవాడు కావడమే. అది ఆయనకు ఎంతో బాధ కలిగించింది. రైలు దిగిన తెల్లజాతీయుడు కొందరు అధికారులను వెంటబెట్టుకొని వచ్చాడు. వారంతా గాంధీజీ వద్దకు వచ్చి నిలబడ్డారు. ఆయననే చూస్తూ ఉన్నారు.
మరో అధికారి గాంధీజీ వద్దకు వచ్చి ‘‘నాతో రా, నువ్వు సాధారణ బోగీలో ఎక్కాలి’’ అని అన్నాడు. ‘‘ఎందుకు? నేను మొదటి తరగతి టికెట్టు తీసుకున్నాను’’ అని గాంధీజీ చెప్పారు. ‘‘అదంతా తెలియదు. ముందు నువ్వు దిగి, మిగతావాళ్లు ఉండే సాధారణ బోగీ ఎక్కు’’ అంటూ ఆ అధికారి ఆయన్ని గదమాయించాడు. ‘‘మరోసారి చెబుతున్నా. మొదటి తరగతిలో ప్రయాణించేందుకు అవసరమైన టికెట్ నా వద్ద ఉంది. డర్బన్ స్టేషన్ ఈ టికెట్ ఇచ్చింది. నేను ఈ బోగీలోనే ప్రయాణిస్తాను’’ అని గాంధీజీ స్పష్టం చేశారు. ‘‘నువ్వు ఇందులో ప్రయాణించడం కుదరదు. దిగిపోతావా? లేక పోలీసులను పిలిచి బయటకు గెంటించమంటావా?’’ అంటూ అధికారి అరిచాడు.
‘‘మీరు చేయాల్సింది చేసుకోండి. నేను మాత్రం దిగను’’ అని గాంధీజీ అన్నారు. అప్పుడు ఓ పోలీసు కాన్‌స్టేబుల్ వచ్చి, గాంధీజీ రెక్క పుచ్చుకొని బయటకు లాగేశాడు. ఆయన పెట్టెబేడను కూడా ప్లాట్‌ఫాంపై విసిరేశాడు. గాంధీజీ మరో బోగీ ఎక్కడానికి ఒప్పుకోలేదు. ఆయన్ని అక్కడే వదలి రైలు వెళ్లిపోయింది. నల్లజాతీయులను ఎంత హీనంగా చూస్తారో, జాత్యాంహకారం వల్ల కలిగే బాధ ఏమిటో ఆ ఘటనతో గాంధీజీకి తెలిసింది. జాతి వివక్షను రూపు మాపాలని ఆ క్షణమే ఆయన కంకణం కట్టుకున్నారు. అందుకు ఎందాకైనా పోరాడాలని నిర్ణయించుకున్నారు. పోరాటానికి సిద్ధమైన గాంధీ, చివరకు ప్రిటోరియా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా రైల్వే జనరల్ మేనజర్‌కు టెలిగ్రాం ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి, తన నిరసనను తెలియజేశారు. ఇక్కడ నుంచి మొదలైన గాంధీ పోరాటం భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చే వరకు ఆగలేదు.
(సౌజన్యం బి.బి.సి)
Comments
Please login to add a commentAdd a comment