
భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను లాహోర్ జైలులో ఉరి తీశారన్న వార్తతో ఆగ్రహించిన ప్రజానీకం పలుచోట్ల గట్టిగా నిరసనలు తెలిపింది. కాన్పూర్‌లో ఘోరమైన మత కల్లోలాలు జరిగాయి. నాలుగు వందల మంది వరకు చనిపోయారు. అలాంటి సమయంలో ఆ రక్తపాతం నుంచి, ఆ మౌఢ్యం నుంచి అటు హిందువులను, ఇటు ముస్లిం మతానికి చెందిన అమాయకులను రక్షించడానికి ఒక జాతీయ కాంగ్రెస్ నాయకుడు, గాంధీజీ అనుచరుడు నేరుగా రంగంలో దిగారు. అదే అదనుగా ఒక మూక ఆయన మీద పడి, కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేసింది.
రెండురోజులకు గాని ఆయన మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. ఆయనే గణేశ్‌శంకర్ ‘విద్యార్థి’. గణేశ్ శంకర్ విద్యార్థి (1890–1931) ఒక పేద కుటుంబంలో పుట్టారు. అలహాబాద్ సమీపంలోన అట్టార్‌సుయి ఆయన జన్మస్థలం. ఆయన అభిరుచి అంతా పత్రికా రచనే. ‘స్వరాజ్య’ పత్రికకు రచనలు పంపించేవారు. ఆ రచనల కోసం ఆయన పెట్టుకున్న పేరు ‘విద్యార్థి’. చివరికి ఆయనే ‘ప్రతాప్’ అనే వారపత్రిక ఆరంభించారు.
‘అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిని నేను. ఉద్యోగులు, జమీందార్లు, పెట్టుబడిదారులు, కులీనులు ఎవరు ఈ పనికి పాల్పడినా నేను వారిపై పోరాడతాను. అమానవీయతకు వ్యతిరేకంగా నా ప్రాణమొడ్డి పోరాడతాను. అందుకు భగవంతుడు నాకు శక్తిని ఇస్తాడని కాంక్షిస్తున్నాను’ అని ఒక సందర్భంలో విద్యార్థి అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో ఆయన పోరాటానికి, కృషికి గౌరవ సూచకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2017 జూలై 18న కాన్పూర్ విమానాశ్రయానికి ‘గణేశ్ శంకర్ విద్యార్థి ఎయిర్‌పోర్ట్’ అని పేరు పెట్టింది.
(చదవండి: నేను మహిళను నేను విప్లవాన్ని...చిట్టగాంగ్‌లోని పహార్తలి యూరోపియన్ క్లబ్... ప్రీతిలతా వడ్డేదార్)
Comments
Please login to add a commentAdd a comment