సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన ఓ డాక్యుమెంటరీ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కేంద్రం ఆ డాక్యుమెంటరీని, దానికి సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్ చేసింది. ఈ పరిణామంపై పిటిషన్‌లు దాఖలుకాగా.. శుక్రవారం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ, 2002 గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకోవాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కేంద్రం ఆ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ.. అలాగే భవిష్యత్‌లోనూ సెన్సార్ చేయకుండా అడ్డుకోవాలని పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌లో తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని నిషేధించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. పబ్లిక్ డొమైన్ నుంచి దానిని తొలగించడాన్ని.. డాక్యుమెంటరీ లింకులను సోషల్ మీడియా నుంచి తొలగించేందుకు కేంద్రం తన విశేష అధికారాలను ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. ఇది రాజ్యాంగవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు పిటిషనర్ తరపు న్యాయవాది ఎంఎల్ శర్మ. ఇక.. దిగ్గజ జర్నలిస్ట్ ఎన్ రామ్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా మరో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు.
గుజరాత్ అలర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని విమర్శిస్తూ రెండు భాగాలుగా ఇండియా: ది మోదీ క్వశ్చన్ పేరుతో డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. దీంతో దుమారం రేగింది. ఇంగ్లండ్‌లో ఉన్న భారత సంతతి సైతం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు జనవరి 21వ తేదీన కేంద్రం ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. విశేష అధికారాలను ఉపయోగించి యూట్యూబ్, ట్విట్టర్‌లలో డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులను, పోస్టులను తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment