దాదర్ (ముంబై): పర్యాటకులను ఆకట్టుకునేందుకు బుధవారం నుంచి ఓపెన్ టాప్ (టాప్ లెస్) బస్సులను పునఃప్రారంభించాలని బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను సడలించింది. దీంతో ముంబైకి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు, నగరంలోని వారసత్వ కట్టడాలు, ఇతర పర్యాటక ప్రాంతాలను ఈ ఓపెన్ టాప్ బస్సుల ద్వారా తిలకించే సౌకర్యాన్ని బెస్ట్ కల్పించింది. దీంతో నష్టాల్లో నడుస్తున్న సంస్థకు ఈ బస్సులు కొంత ఆదాయాన్ని తెచ్చిపెడతాయని బెస్ట్ అధికారులు భావిస్తున్నారు.
సాధారణంగా ముంబై నగర అందాలను తిలకించేందుకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ టాప్ లెస్ బస్సులు పర్యాటకులకు సేవలు అందించాయి. కానీ, లాక్‌డౌన్ అమలులోకి వచ్చాక ఈ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. అయితే, ఇప్పుడు పరిస్థితులు యథాస్థితికి రావడంతో ఇన్నాళ్లూ డిపోలకే పరిమితమైన ఓపెన్ టాప్ బస్సులను మళ్లీ రోడ్డుపైకి తేవాలని బెస్ట్ భావించింది. ఈ మేరకు దీపావళి పర్వదినానికి ముందే ఈ బస్సులను పునఃప్రారంభించాలని బెస్ట్ నిర్ణయించింది.
చదవండి: (మళ్లీ తెరపైకి ‘ముల్లై పెరియార్’)
అయితే, ఈ బస్సులు రోజంతా నడవవని, కేవలం సాయంత్రం తరువాతే రోడ్డుపైకి వస్తాయని ఓ అధికారి తెలిపారు. ప్రముఖ కట్టడాలైన గేట్ వే ఆఫ్ ఇండియా, బీఎంసీ ప్రధాన కార్యాలయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్‌ఎంటీ), ప్రిన్స్ వెల్స్ ఆఫ్ మ్యూజియం, మంత్రాలయ, అసెంబ్లీ భవనం, ఎన్‌సీపీఏ, మెరైన్ డ్రైవ్, చౌపాటి, చర్చిగేట్ రైల్వే స్టేషన్, ఓవల్ మైదాన్, రాజాబాయి టవర్, హుతాత్మ చౌక్, హార్నిమన్ సర్కిల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏషియాటిక్ లైబ్రరీ, ఓల్డ్ కస్టమ్ హౌస్ తదితరాల కట్టడాలను తిలకించేలా ఈ బస్సుల రూట్ మ్యాప్ ఉంటుందన్నారు.
ఈ బస్సుల్లో పై అంతస్తులో కూర్చునేవారు రూ. 150, కింది అంతస్తులో కూర్చునేవారు రూ. 75 చొప్పున చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, మొదటి బస్సు గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి సాయంత్రం 6.30 గంటలకు బయలు దేరనుంది. తరువాత 7.45 గంటలకు ఓ బస్సు, 8.00 గంటలకు మరో బస్సు ఉండనుండగా, చివరి బస్సు 9.15 గంటలకు బయలు దేరుతుంది. ఈ బస్సు టికెట్లు సీఎస్‌ఎంటీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చౌక్, గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న బెస్ట్ సంస్థకు చెందిన సబ్ టికెట్ కౌంటర్ల వద్ద లభిస్తాయని బెస్ట్ సంస్థ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment