మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాడాలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి 'జైరాం రమేష్' ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. దీనిపై ఎన్నికల సంఘం (EC) పంచుకున్న డేటా అసంపూర్ణమైనదని వ్యాఖ్యానించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. కానీ ఓటర్ తన ఓటును సరిగ్గా వేసినట్లు తెలుసుకోవడానికి పోలింగ్ ప్రక్రియలో ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)ని ప్రవేశపెట్టాలని జైరాం రమేష్ అన్నారు. తమ పార్టీ గత సంవత్సరం నుంచి ఈసీతో అపాయింట్‌మెంట్ కోరుతూనే ఉందని, కానీ వారు ఇవ్వలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను కలవడానికి ఈసీ ఎందుకు, ఎవరికి భయపడుతోంది అని కేంద్ర మాజీ మంత్రి ప్రశ్నించారు.
ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాలో.. ''ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారు, దర్యాప్తు సంస్థల బెదిరింపుల కారణంగా బాండ్లు కొనుగోలు చేసిన వారు, కాంట్రాక్టులు పొందడానికి లంచంగా బాండ్లను కొనుగోలు చేసిన వారు, షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసినవారు'' మాత్రమే నాలుగు కేటగిరీలుగా ఉన్నారని జైరాం రమేష్ పేర్కొన్నారు.
స్వతంత్ర భారతావనిలో ఇదే అతిపెద్ద కుంభకోణమని, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని.. ప్రజాకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన ఒక రోజు తర్వాత జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment