మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే భారత రెజ్లర్ల వివాదంపై విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా భారత రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. అయినా కూడా ఈ కేసులో విచారణ నత్తనడకన సాగడం దురదృష్టకరమని ప్రీతమ్ ముండే ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా కాకుండా ఒక మహిళగా విచారణ వేగవంతం చేయమని కోరుతున్నానని తెలిపారు.
పెరుగుతోన్న వ్యతిరేకత...
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ భారత రెజ్లర్లు చేస్తోన్న నిరసన రోజురోజుకీ ఉధృత రూపం దాల్చుతోంది. స్వయంగా సొంత పార్టీకి చెందినవారే బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా ఈ కోవలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే చేరిపోయారు.
విచారణ జరుగుతున్న తీరు విచారకరం...
ఓ ప్రెస్ మీట్లో ప్రీతమ్ ముండే మాట్లాడుతూ.. ‘ఒక మహిళ నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ముందు విచారణ చేపట్టాలి. అలా చేయకుండా కాలయాపన చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇంతకాలం వారు కష్టపడి సాధించిన పతకాలను గంగానదిలో వేయడానికి సిద్దపడ్డారంటేనే వారు ఎంత వ్యధను అనుభవిస్తున్నారో నాకు అర్ధమవుతోంది.
వారి బాధను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నేను బీజేపీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధినే అయినా కూడా ఈ కేసులో విచారణ జరుగుతున్న తీరు పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. దయచేసి విచారణను వేగవంతం చేసి, వీలైనంత తొందరగా నిజానిజాలు తేల్చి వారికి న్యాయం చేయండి. ఒక ఎంపీగా కాకుండా ఒక మహిళగా అభ్యర్ధిస్తున్నాను’ అని అన్నారు.
చదవండి: పాకిస్తాన్, చైనాతో పోలిస్తే ఆ విషయంలో భారత్ చాలా బెటర్..
Comments
Please login to add a commentAdd a comment