లక్నో/అగర్తలా: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న జరిగిన ఉప ఎన్నికలో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార బీజేపీ మూడు, ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, త్రిపురలోని ధన్‌పూర్ సీట్లను బీజేపీ నిలబెట్టుకోవడంతోపాటు త్రిపురలోని బొక్సానగర్ స్థానాన్ని సీపీఐ నుంచి కైవసం చేసుకుంది. బెంగాల్‌లోని ధుప్‌గురిలో జరిగిన ముక్కోణపు పోటీలో టీఎంసీ అభ్యర్థి గెలిచారు.
ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థి కూడా బరిలో ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారు. ఇక కేరళలోని పుత్తుప్పల్లి సీటును ప్రతిపక్ష కాంగ్రెస్–యూడీఎఫ్ కూటమికి చెందిన చాందీ ఊమెన్ గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన దిగ్గజ నేత ఊమెన్ చాందీ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఊమెన్ చాందీ కొడుకే చాందీ ఊమెన్. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇండియా కూటమిలోనివే అయినప్పటికీ ఇక్కడ పరస్పరం తలపడటం గమనార్హం. ఇండియా కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) జార్ఖండ్‌లోని దుమ్రి సీటును నిలబెట్టుకుంది. యూపీలోని ఘోసి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండియా కూటమి బలపరిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి బీజేపీకి చెందిన సమీప ప్రత్యర్థిపై గెలిచారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ ఉమ్మడి పోరు
బనశంకరి: వచ్చే లోక్‌సభ ఎన్నికలను బీజేపీ, జేడీఎస్ పారీ్టలు ఉమ్మడిగా ఎదుర్కోనున్నాయని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. ఢిల్లీలో జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చలు జరిపారన్నారు. యడియూరప్ప శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అయిదు వరకు ఎంపీ స్థానాలను జేడీఎస్‌కు కేటాయించడానికి అమిత్ షా సమ్మతించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment