ఈడీ అధికారులపై దాడి కేసులో దర్యాప్తు వేగవంతం
కోల్‌కతా: సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత షాజహాన్ షేక్‌ను సీబీఐ అధికారులు ఎట్టకేలకు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. అతడిని తక్షణమే సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు రెండుసార్లు ఉత్తర్వులు జారీ చేయడంతో పశి్చమ బెంగాల్ సీఐడీ అధికారులు స్పందించక తప్పలేదు.
బుధవారం సీబీఐ అధికారులకు అప్పగించారు. వాస్తవానికి ఈడీ అధికారులపై దాడి కేసులో దర్యాప్తును, నిందితుడు షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించాలంటూ మంగళవారమే కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. అయినా పశి్చమ బెంగాల్ ప్రభుత్వం లెక్కచేయలేదు. ఈ ఉత్తర్వును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెంగాల్ ప్రభుత్వ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
మరోవైపు కలకత్తా హైకోర్టులో ఈడీ బుధవారం మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం నాటి ఉత్తర్వును అమలు చేయాలని, షాజహాన్ షేక్‌ను సాయంత్రం 4.15 గంటలకల్లా సీబీఐకి అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ బృందం బుధవారం సాయంత్రం 4 గంటలకు సీఐడీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది.
సీఐడీ అధికారులు సాయంత్రం 6.48 గంటలకు షాజహాన్ షేక్‌ను సీబీఐ బృందానికి అప్పగించారు. అంతకంటే ముందు అతడిని ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. కరడుగట్టిన నేరగాడిగా ముద్రపడిన షాజహాన్ షేక్‌పై సందేశ్‌ఖాలీలో దళిత, గిరిజన మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తీవ్రంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment