లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సీసోడియా బెయిల్ మంజూరు చేయాల్సిందిగా మరోసారి ఢిల్లీ కోర్టుని అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరుఫు లాయర్ సిసోడియా భార్యకు అస్వస్థతని, కొడుకు విదేశాల్లో ఉన్నాడని అందువల్ల ఆయనే తన భార్యను చూసుకోవాల్సి ఉందని కోర్టుకి తెలిపారు. ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అతని బెయిల్‌ని వ్యతిరేకిస్తూ వస్తోంది. అతను ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉన్నాడని కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రభావితం చేయగలడంటూ బెయిల్ నిరాకరించింది సీబీఐ.
ఐతే సిసోడియా సీబీఐ దర్యాప్తుకు తాను సహకరిస్తానని, సోదాల్లో తనకు వ్యతిరేకంగా ఎలాంటి నేరారోపణలు లేవని సిసోడియా తరుఫు లాయర్ వాదించారు. ఇకపై అతనికి కస్టడీ అవసరం లేదని ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన తరుఫు న్యాయవాది చెప్పారు. కానీ సీబీఐ మాత్రం సాక్షులను ప్రభావితం చేయగలడని, దర్యాప్తును అడ్డుకోగలడని వాదిస్తోంది. ఐతే సిసోడియ న్యాయవాది మాత్రం ఆయనపై ఆరోపించిన నేరాలకు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్షే పడుతుందని, ఇకపై ఎలాంటి జైలు శిక్ష విధించడం సమర్థనీయం కాదని కోర్టుకి విన్నవించారు.
సిసోడియా 18 పోర్ట్‌ఫోలియాలను కలిగి ఉన్నాడని, అతను ఉపయోగించిన ఫోన్‌లు, కీలకమైన ఫైళ్లను అతను ధ్వంసం చేశాడని, ఇదేమి తెలిసీ తెలియకుండా చేసిన పని కాదని ఉద్దేశపూర్వకంగా చేసిందేనని నొక్కి చెబుతోంది సీబీఐ. అలాగే ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి సీబీఐకు 60 రోజులు సమయం పడుతుందని, ఆయన బయటకు వస్తే దర్యాప్తు పక్కదోవ పట్టే ప్రమాదం ఉందని పేర్కొంది.
(చదవండి: మనీష్ సిసోడియాకు మరోసారి చుక్కెదురు..బెయిల్ విచారణ వాయిదా..)
Comments
Please login to add a commentAdd a comment